ధరణిలో ఆస్తుల వివరాల నమోదుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
13:22 November 03
ధరణి ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ
ధరణి ఆస్తుల నమోదుపై హైకోర్టు విచారణ చేసింది. ఆస్తుల వివరాల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించవద్దని ఆదేశించింది. వ్యవసాయ ఆస్తుల నమోదులో ఆధార్ వివరాల కోసం ఒత్తిడి చేయవద్దన్న న్యాయస్థానం... ఇప్పటివరకు సేకరించిన వివరాలను థర్డ్ పార్టీకి ఇవ్వొద్దని సూచించింది.
ఏ చట్ట ప్రకారం తీసుకుంటున్నారు?
ఏ చట్టం ఆధారంగా ఆధార్, కులం వివరాలు సేకరిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టం సాగు భూములకు సంబంధించింది మాత్రమేనని స్పష్టం చేసింది. వ్యక్తిగత వివరాలకు భద్రత ఎలా కల్పిస్తారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. డేటా భద్రతకు సంబంధించి కొత్త రెవెన్యూ చట్టంలో ప్రస్తావనే లేదని వ్యాఖ్యానించింది. డేటా దుర్వినియోగమైతే ప్రజల భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపింది. దీనిపై స్పందించిన ఏజీ... డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నట్లు హైకోర్టుకు తెలిపారు. దానిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు... ఏజీ రెండు వారాలు గడువు కోరగా... కోర్టు విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.