HC ON ANKABABU PETITION : సీనియర్ జర్నలిస్టు అంకబాబు పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టేయాలని హైకోర్టులో అంకబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం సీఐడీ కేసులో ఆయనపై తదుపరి చర్యలు చేపట్టొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల 8కి వాయిదా వేసింది. గన్నవరం ఎయిర్‌పోర్టులో బంగారం కేసుకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని అంకబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ జరిగింది:Journalist Ankababu in CID custody: సామాజిక మాధ్యమాల్లో పోస్టు ఫార్వర్డ్ చేశారంటూ 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును సెప్టెంబర్ 22న సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ప్రకాశం రోడ్డులోని అంకబాబు నివాసానికి గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో సివిల్ డ్రెస్‌లో ఉన్న 8 మంది సీఐడీ అధికారులు వెళ్లారు. వారిలో ఒక మహిళ ఉన్నారు. తాము సీఐడీ అధికారులమని, తమ వెంట రావాలని కోరారు.