Ganesh immersion: గణేష్ నిమజ్జనంపై ప్రభుత్వ నిర్ణయమేంటి?: హైకోర్టు - telangana varthalu
14:18 August 05
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనం నిషేధించాలన్న పిటిషన్‌పై విచారణ
హుస్సేన్ సాగర్‌లో ఈ ఏడాది వినాయక నిమజ్జనంపై ప్రభుత్వ నిర్ణయమేంటో ఈనెల 10లోగా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. కొవిడ్ తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గిపోలేదని.. ఎప్పుడైనా ఉప్పెనలా విజృంభించవచ్చునని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం వ్యాఖ్యానించింది. హుస్సేన్ సాగర్‌లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలని కోరుతూ న్యాయవాది వేణుమాధవ్ 2011లో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది.
కరోనా కారణంగా గతేడాది వినాయక నిమజ్జనానికి అనుమతివ్వలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది హరీందర్ తెలిపారు. నిమజ్జనంపై ఈ ఏడాది నిర్ణయమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం తెలుసుకొని చెబుతానని న్యాయవాది పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం పూర్తిస్థాయి శాశ్వత నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. ప్రతీ ఏడాది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించింది. హుస్సేన్ సాగర్‌ను కాలుష్య రహితంగా, అందంగా, పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని అభిప్రాయపడింది. గణేష్ నిమజ్జనంపై ఈ ఏడాది నిర్ణయమేంటో తెలపాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: HYD Underground Water: ఉబికివస్తోన్న భూగర్భజలాలు.. ఇంకుడు గుంతలతో మరింత మేలు