Highcourt on Boy's death in dogs attack As sumoto Case: హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో ఆదివారం కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు సీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా నిన్న హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది.
హైదరాబాద్ అంబర్ పేటలో చిన్నారిని వీధికుక్కలు పొట్టన పెట్టుకున్న తరుణంలో.. వీధి కుక్కల బెడద, కుక్క కాటు నివారణ కోసం పురపాలకశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. వీధికుక్కలు పట్టేందుకు వాహనాలు, బృందాల సంఖ్య పెంచాలని... వీధి కుక్కలకు వంద శాతం స్టెరిలైజేషన్ చేయాలని ఆదేశించారు. తీవ్రత అధికంగా, కుక్కకాటు కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని... ఇందుకోసం కాలనీ, బస్తీ, పట్టణ సంక్షేమ సంఘాలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు.
వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి : స్టెరిలైజేషన్ చేయని, చెవులు లేకుండా అగ్రెసివ్‌గా ఉండే కుక్కల సమస్యను 040 21111111 హెల్ప్ లైన్ నంబర్, మై జీహెచ్ఎంసీ, సిటిజన్ బడ్డీ యాప్‌ల ద్వారా తీసుకొచ్చేలా అవగాహన కల్పించాలని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, వసతిగృహాలు, మాంసం దుకాణాల వద్ద మిగిలిన వ్యర్థాల కోసం కుక్కలు గుమికూడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన పురపాలకశాఖ... వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేయని దుకాణాలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఆసుపత్రులు, వసతి గృహాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వీధికుక్కల విషయంలో అవగాహన కల్పించేలా స్వయం సహాయక బృందాలు, మెప్మా, పారిశుధ్య సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని... రానున్న నెల రోజుల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో పాటించాలి:వీధికుక్కలు, వాటి ఆహారం సంబంధిత అంశాలపై రానున్న నెల రోజుల్లో అన్ని కాలనీ, బస్తీ, పట్టణ సమాఖ్యను కలిసి ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. కుక్కల విషయంలో పారిశుధ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. మూసీ నదిలోని వీధి కుక్కలు, అటవీ ప్రాంతాల్లో ఉండే కుక్కలను వందశాతం పట్టుకొని స్టెరిలైజేషన్ చేసేలా విస్తృత చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నారాయణగూడ ఐపీఎం, ఫీవర్ ఆసుపత్రుల నుంచి కుక్కకాటు బాధితుల వివరాలను వెంటనే తీసుకొని ఆయా ప్రాంతాల్లోని కుక్కులను వెంటనే పట్టుకొని స్టెరిలైజేషన్ చేసేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వీధికుక్కుల విషయంలో చేయదగిన, చేయకూడని చర్యల వివరాలతో ఆయా ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని... ఎనిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబిస్ ప్రోగ్రాం ప్రాధాన్యతను వివరించాలని పేర్కొన్నారు. వేసవిలో కుక్కల కోసం పబ్లిక్ ప్రదేశాలకు దూరంగా నీటితొట్టెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని పట్టణాల మున్సిపల్ కమిషనర్లు ఎలాంటి అలక్ష్యం చేయకుండా మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో పాటించాలని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: