ఆన్‌లైన్ తరగతుల ప్రభావం పిల్లలపై మానసికంగా, శారీరకంగా ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఆన్‌లైన్ తరగతులు నిషేధించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పిటిషన్ వేయగా ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుంది: హైకోర్టు
13:40 August 06
ఆన్ లైన్ తరగతులు నిషేధించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఆన్‌లైన్, దూరవిద్య ద్వారా తరగతులు ప్రారంభించాలని చెప్పామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీనిపై మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. రెండ్రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరం ప్రకటిస్తామంది. ప్రైవేట్ పాఠశాలలు పాటించాల్సిన విధివిధానాలు కూడా ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
మార్చిలోనే ప్రారంభించినట్లు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలు చెబుతున్నాయని హైకోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యాశాఖ పరిధి పాఠశాలలకే వర్తిస్తుందా? అని కోర్టు ప్రశ్నించింది. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గంటల తరబడి ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నాయన్న హైకోర్టు.. 10 ఏళ్లలోపు పిల్లలు గంటల తరబడి పాఠాలు ఎలా వినగలరో తెలపాలంది.
ఫీజులు వసూలు చేయొద్దన్న జీవోను పాఠాశాలలు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని.. విచారణ పూర్తయ్యాక అవసరమైతే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామని హైకోర్టు వెల్లడించింది. ఆన్ లైన్ తరగతులకు వైఖరి వెల్లడించేందుకు మరికొంత సమయం సీబీఎస్ఈ కోరింది. విచారణను ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది.