ఆర్టీసీ తీరుపై హైకోర్టు అసంతృప్తి... విచారణ గురువారానికి వాయిదా - tsrtc strike case
14:40 November 01
ఆర్టీసీ తీరుపై హైకోర్టు అసంతృప్తి... విచారణ గురువారానికి వాయిదా
ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మ అందజేసిన నివేదికపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసి... విచారణను గురువారంకు వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెపై గత నెల 30న కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలన్నీ ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ రూ.336 కోట్లు ఇచ్చిందని... ఇక ఇవ్వలేమని చెప్పిందని ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు. చట్ట ప్రకారం జీహెచ్‌ఎంసీకి ఆర్టీసీ నష్టాలు పూడ్చాల్సిన బాధ్యత లేదని ధర్మాసనానికి వివరించారు. సమ్మె కాలంలో రూ.82 కోట్ల నష్టం వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు.
ఆర్టీసీ ఎండీ సమర్పించిన నివేదిక అంతా తప్పుడు లెక్కలతో ఉందని ధర్మాసనం పేర్కొంది. బస్సుల కొనుగోలు రుణాన్ని రాయితీ, బకాయిల చెల్లింపుగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ చెల్లించాల్సిన అవసరమే లేనప్పుడు... 2015 నుంచి 2017 వరకు రూ.336 కోట్లు ఎందుకు ఇచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టుకు సమర్పించే నివేదికలు ఇలాగేనా? అంటూ ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని అసెంబ్లీలో మంత్రి చెప్పారన్న కార్మిక సంఘాలు... మంత్రి చెప్పింది నమ్మాలా? మీరు కోర్టుకు చెప్పింది నమ్మాలా? అని సునీల్ శర్మను కోర్టు ప్రశ్నించింది.అసెంబ్లీలో మంత్రి ప్రజలకు తప్పు చెప్పారని అనుకోవడం లేదన్న హైకోర్టు... మీ మంత్రినే మీరు తప్పుదోవ పట్టిస్తున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.