తెలంగాణ

telangana

ETV Bharat / state

సమ్మెపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు... విచారణ వాయిదా... - highcourt on tsrtc strike today news today in telugu

ఆర్టీసీ సమ్మెపై విచారణను హైకోర్టు మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి రూపొందించిన నివేదికను యాజమాన్యం న్యాయస్థానానికి సమర్పించగా... ధర్మాసనం ఎదుట సుదీర్ఘ వాదనలు జరిగాయి. సంస్థ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో కేవలం.. రెండింటినే అంగీకరించడం సాధ్యమని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు వివరించారు. డిమాండ్లు అంగీకరించడం సాధ్యం కాదని ముందే నిర్ణయించుకొని చర్చలకు పిలిస్తే లాభమేంటని ప్రశ్నించింది. బస్‌పాస్‌ రాయితీలు, జీహెచ్​ఎంసీ చెల్లించాల్సిన బకాయిలన్నీ కలిపితే సుమారు రూ.4,900 కోట్లు రావాల్సి ఉందని కార్మికులు కోర్టుకు తెలిపారు.

HIGH COURT HEARING ON TSRTC STRIKE... HEARING POSTPONED TO TOMORROW AFTERNOON

By

Published : Oct 28, 2019, 6:05 PM IST

Updated : Oct 29, 2019, 6:43 AM IST

సమ్మెపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన ఆర్టీసీ యాజమాన్యం..చర్చల వివరాలతో అదనపు కౌంటర్‌ దాఖలు చేసింది. శనివారంనాటి చర్చల సారాంశాన్ని హైకోర్టుకు తెలిపింది. అన్ని డిమాండ్లపై చర్చించాలని.. కార్మిక సంఘాలు పట్టుబట్టాయని వివరించింది. హైకోర్టు ఆదేశాల మేరకు 21 అంశాలపై చర్చించేందుకు ఐకాస నాయకులు అంగీకరించలేదని యాజమాన్యం తెలిపింది. కోర్టు ఉత్తర్వుల్లో.. 21 అంశాలను ఉదాహరణగానే పేర్కొన్నారని కార్మిక సంఘాలు వివరించాయి. ప్రభుత్వంలో... ఆర్టీసీ విలీనం ప్రధాన ఆటంకంగా ఉందని.. హైకోర్టు వ్యాఖ్యానించింది. మిగిలిన అంశాలపై భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయన్న కోర్టు.. అందుకే మిగతా అంశాలు ముందుగా చర్చించాలని పేర్కొన్నట్లు తెలిపింది. అన్ని సమస్యలు రాత్రికి రాత్రే పరిష్కారం కావన్న న్యాయస్థానం.. ప్రస్తుతానికి విలీనం డిమాండ్ పక్కన పెట్టకపోతే ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతుందని పేర్కొంది. రెండు వర్గాలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు మరోసారి గుర్తుచేసింది.

యాజమాన్యానికి అంత ఆర్థికస్థితి లేదు...

ఈడీల కమిటీ 21 అంశాలను అధ్యయనం చేసి ఆర్టీసీ ఎండీకి నివేదిక ఇచ్చిందని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందులో కార్మిక సంఘాలు ఇచ్చిన 21 డిమాండ్లలో పదహారింటికి డబ్బులు అవసరమని.. ప్రస్తుతానికి సంస్థకి ఆ ఆర్థికస్థితి లేదని కమిటీ తెలిపింది. మరో రెండింటికి చాలా నిధులు అవసరమని.. అవి అసాధ్యమని కమిటీ పేర్కొంది. మరోఅంశం పునర్విభజన చట్టం ప్రకారం అమలుచేయడం సాధ్యం కాదన్న ఈడీ కమిటీ.. రెండు డిమాండ్లు మాత్రమే అంగీకరించడం సాధ్యమని తెలిపింది. సమ్మె వల్ల రూ.175 కోట్లు నష్టం వాటిల్లిందని ఆర్టీసీ తెలపగా... సంస్థ వద్ద ప్రస్తుతం రూ.10 కోట్లే ఉన్నాయని పేర్కొంది. తీర్పుఇచ్చిన మరుసటి రోజే రాజకీయ పార్టీలతో సమావేశం, బంద్ నిర్వహించాయని అదనపు ఏజీ కోర్టుకు వివరించారు.

అదనపు ఏజీ తీరుపై అసహనం...

ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని ఎందుకు నియమించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. డిమాండ్లు అంగీకరించడం సాధ్యంకాదని ముందే నిర్ణయించుకొని.. చర్చలకు పిలిస్తే ఏం లాభమని ప్రశ్నించింది. సమ్మె వల్ల ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల కంటే.. సాధారణ ప్రజల ఇబ్బందులు ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించింది. 21 డిమాండ్లలో నాలుగింటి పరిష్కారానికి రూ.46.2 కోట్లు ఖర్చవుతుందని నివేదికలో పేర్కొనట్లు వివరించింది. ప్రస్తుతం సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.50 కోట్లు ఆర్టీసీకి ఇవ్వగలదా అని న్యాయస్థానం అడిగింది. ప్రభుత్వం ఇప్పటికే రూ.450 కోట్లు ఇచ్చిందని... ఇంకా ఎంత ఇవ్వగలదని ఏఏజీ సమాధానమిచ్చారు. అదనపు ఏజీ తీరుపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు... అడ్వకేట్ జనరల్‌ను పిలవాలని ఆదేశించింది. కార్మిక సంఘాల ప్రవర్తన సరిగా లేదన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్​ ప్రసాద్... రూ. 50 కోట్లతో సమస్య పరిష్కారం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో రైల్వేలు ప్రజల అవసరాలు తీర్చడం లేదని.. బస్సులపైనే ఆధారపడుతున్నారని కోర్టు చెప్పింది. సర్కారు ఎన్నో ఖర్చులు చేస్తోందని.. రూ.47 కోట్లు ఇవ్వలేదా అని అడిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి మంగళవారం చెబుతామని ఏజీ వివరించగా.. మీకు ఇబ్బందిగా ఉంటే సీఎస్​​, ఆర్థికశాఖ కార్యదర్శిని పిలుస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.

సమ్మెపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు... విచారణ రేపటికి వాయిదా...

కార్మికులకు ధర్మాసనం సూచనలు...

ఆర్టీసీ నష్టాల్లో ఉందని మీరే ఒప్పుకుంటున్నారని.. సహేతుకంగా ఉండాలని కార్మిక సంఘాలకు హైకోర్టు సూచించింది. సమస్యలకు నష్టాలు కారణం కాదన్న కార్మిక సంఘాలు... రాయితీ బస్‌పాస్‌లతో రోజుకు రూ.2.3 కోట్ల నష్టం వస్తోందని కోర్టు దృష్టి తీసుకెళ్లారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ రూ.1400 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా... యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. నష్టాలు వస్తున్నా ప్రైవేట్ ఆపరేటర్ల మాదిరిగా ఆర్టీసీ నేరుగా టికెట్ల ఛార్జీలు పెంచుకునే అధికారం లేదని కార్మిక సంఘాలు కోర్టుకు వివరించాయి. బస్‌పాస్‌ రాయితీలు, రీఎంబర్స్‌మెంట్‌, జీహెచ్​ఎంసీ చెల్లించాల్సిన బకాయిలన్నీ కలిపితే సుమారు రూ.4,900 కోట్లు రావాల్సి ఉందని కార్మికులు కోర్టుకు వివరించారు. రూ.47కోట్లు నీటి చుక్క మాత్రమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణనను రేపు మధ్యాహ్నం రెండున్నర గంటలకి వాయిదావేసింది.

ఇదీ చదవండిః 'నిమ్స్​ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా'

Last Updated : Oct 29, 2019, 6:43 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details