Transfer of APAT employees : ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రైబ్యునల్ ఏపీఏటీ నుంచి డిప్యుటేషన్‌పై హైకోర్టుకు వచ్చి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని.. హైకోర్టును సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు లేఖ ఇవ్వడం తప్పిదమేనని.. ఏపీ అడ్వొకేట్ జనరల్ ధర్మాసనానికి నివేదించారు. అందుకు క్షమాపణ కోరుతున్నామని తెలిపారు. ఆ లేఖను ఉపసంహరించినట్లుగా భావించాలని కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు పరిపాలన విభాగంతో ప్రభుత్వం చర్చిస్తోందని చెప్పారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలిచ్చింది.
ఏపీఏటీ ని రద్దు చేశాక అక్కడి నుంచి డిప్యుటేషన్‌పై హైకోర్టుకు వచ్చి 70 మంది సేవలందిస్తున్నారు. వారిని వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రక్రియను సవాల్ చేస్తూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. హైకోర్టును సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని ఉపసంహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీ ప్రక్రియను నిలుపుదల చేసింది. మంగళవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. ధర్మాసనం స్పందిస్తూ 2019 నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు హైకోర్టులో పనిచేస్తున్నారని.. వారితో తమకు అనుబంధం ఏర్పడిందని పేర్కొంది.