ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించిన వ్యాజ్యాలన్ని చట్టపరిధిలోనే విచారణ జరిపి తేలుస్తామని హైకోర్టు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పలు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. భార్యాభర్తల వివాదాలు తమ ముందుకు వచ్చినప్పడు... వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుగా కౌన్సెలింగ్ ద్వారా ప్రయత్నిస్తామని... విఫలమైతే పిటిషన్లను చట్టబద్ధంగా తేలుస్తామని పేర్కొంది. అదే తరహాలో ఆర్టీసీ సమ్మె విషయాన్ని పరిష్కరించేందుకు నెల రోజులుగా ప్రయత్నించామని... అలా వీలు కానందున తమ ముందున్న వ్యాజ్యాల చట్టబద్ధత తేలుస్తామని వెల్లడించింది. సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ... దాఖలైన వ్యాజ్యాలు కాలం చెల్లినందున వాటిపై విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించింది.
ఏ ప్రాతిపదికన ఆదేశాలివ్వాలి:
ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని, కార్మికులతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయం చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలన్నీ కలిపి విచారణ జరిపి ఒకే ఉత్తర్వు ఇస్తామని ధర్మాసనం ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించి... విధుల్లోకి చేరేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు ఏ ప్రాతిపదికన ఆదేశాలు ఇవ్వగలదో వివరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అతి ముఖ్యమైన సేవల నిర్వహణ చట్టం.. ఎస్మా ప్రకారం ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టం విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఆర్టీసీ అతి ముఖ్యమైన సర్వీసుగా పేర్కొంటూ ఎస్మా చట్టం ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన జీవో చూపాలని ధర్మాసనం అడిగింది. ఆర్టీసీని ప్రజా వినియోగ సర్వీసుగా ప్రకటించినందున.. ప్రత్యేకంగా జీవో అవసరం లేదని పిటిషనర్లు వాదించారు. ప్రజా వినియోగ సర్వీసులన్నీ ఎస్మా పరిధిలోకి రావన్న హైకోర్టు... ప్రభుత్వం జీవో ఇవ్వక పోతే... ఎస్మా కింద చట్ట విరుద్ధమని ప్రకటించలేమని స్పష్టం చేసింది.
జోక్యం ఎలా..?