MLAs poaching case updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని.. దానికి పదిరోజుల సమయం కావాలి సిట్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే.. న్యాయస్థానాన్ని కోరారు. దీనికి అంగీకరించిన సీజే ధర్మాసనం.. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగిందని దవే ధర్మాసనానికి తెలిపారు. కేసు దర్యాప్తు దశలో ఉండగా.. సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు.
సీనియర్ ఐపీఎస్ నేతృత్వంలో కేసు దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టుకు దుష్యంత్ దవే వివరించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో బయటపడిన ఆధారాల ప్రకారం దర్యాప్తు నిర్వహించారని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ.. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో దాడులు చేస్తున్నాయని.. ఇవి కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనమని ధర్మాసనానికి తెలిపారు. సుప్రీంకోర్టు సైతం అతి తక్కువ సందర్భాలలో కేసులను సీబీఐకి అప్పజెప్పిందని.. అలాంటి సందర్భాలు ఎమ్మెల్యేలకు ఎర కేసులో వర్తించదని ఆయన పేర్కొన్నారు. సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు రద్దు చేసి.. సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని దుష్యంత్ దవే సీజే ధర్మాసనాన్ని కోరారు.
అసలేం జరిగిదంటే: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అందులో పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు అనుమతిచ్చేలా సింగిల్ జడ్జి తీర్పు ఉందని తెలిపింది . తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన కుట్రపై ముఖ్యమంత్రి మీడియా ద్వారా దేశ ప్రజలకు వివరిస్తే తప్పెలా అవుతుందని వివరించింది. ప్రజలకు వివరించేందుకు రాజకీయ పార్టీ నేతగా చేసిన ప్రయత్నమే తప్ప.. దర్యాప్తును ప్రభావితం చేయడం కాదని అందులో వెల్లడించింది.