బీహార్‌కు చెందిన వలస కార్మికులను రేపే స్వస్థలాలకు చేరుస్తామని హైకోర్టుకు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్‌లో ఉన్న 45 మంది బీహార్ కార్మికుల కోసం రేపటి రైలులో అత్యవసర కోటాలో టికెట్లు కేటాయిస్తామని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం భాటియా ఉన్నత న్యాయస్థానానికి నివేదించారు. స్వస్థలాలకు వలస కార్మికులను చేర్చడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.
'అదనపు బోగీలు సాధ్యం కాదు.. ఈక్యూలో టికెట్లు కేటాయిస్తాం'
వలస కార్మికుల తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్ భాటియా.. అదనపు బోగీలు ఏర్పాటు చేయడం సాంకేతికంగా వీలు కాదని కోర్టుకు తెలిపారు. వలస కూలీలను స్వస్థలాలకు చేరుస్తామని న్యాయస్థానానికి నివేదించారు.
రైలుకు అదనపు బోగీ ఏర్పాటు చేయడం సాంకేతికంగా వీలు కాదని డీఆర్ఎం వివరించారు. ప్రస్తుతం రోజుకు 30 టికెట్లను అత్యవసర కోటాలో వలస కార్మికుల కోసం కేటాయిస్తున్నామని.. రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. మరో 20 టికెట్లు కూడా ఇచ్చేందుకు సిద్ధమని దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ తెలిపారు. రైల్వే ప్రతిపాదనకు అంగీకరించిన ధర్మాసనం.. వలస కార్మికులందరూ స్వస్థలాలకు వెళ్లే వరకు ఇదే విధానం కొనసాగించాలని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు రైల్వేతో సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.