High Court on Telangana Rains And floods : తెలంగాణ హైకోర్టులో పలు కీలక పిటిషన్లపై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలపై డాక్టర్ చెరుకు సుధాకర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున వాదించిన న్యాయవాది చిక్కుడు ప్రభాకర్.. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనలో ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
వాదనలు విన్న ధర్మాసనం.. వరద బాధితుల సహాయార్థం వరద ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే.. వరదల్లో ఎంత మంది మరణించారు? బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించారా? అనే దానిపై నివేదిక ఇవ్వాలని కోరింది.ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారా.. లేదా? అనే విషయాలను కూడా వివరించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారో చెప్పాలని హైకోర్టు తెలిపింది. డ్యామ్ పరిరక్షణ చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారా..? అనే విషయాలపై సమగ్ర వివరాలతో ఈ నెల 31వ తేదీకి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
High Court on ORR tender lease issue : అలాగే రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శలకు దారి తీసిన ఓఆర్‌ఆర్ టోల్ కాంట్రాక్టు విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌పైనా హైకోర్టు విచారణ చేపట్టింది. ఓఆర్‌ఆర్ టెండర్లపై ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వడం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎంపీ అడిగిన సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ఏజీని ప్రశ్నించింది. ఎంపీకి సమాచారం ఇవ్వకపోతే పార్లమెంట్‌లో ఎలా చర్చించగలరని న్యాయస్థానం పేర్కొంది. సమాచార హక్కు చట్టం పరిమితుల మేరకు సమాచారం ఇస్తారని ఈ సందర్భంగా ఏజీ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని కోరగా.. హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.