తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీలో కరోనా పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదు: హైకోర్టు - high court latest news

high court hearing on corona tests, treatments
ప్రైవేట్ ఆస్పత్రులను నియంత్రిచాలి: హైకోర్టు

By

Published : Jul 14, 2020, 4:27 PM IST

Updated : Jul 14, 2020, 9:56 PM IST

16:26 July 14

గాంధీలో కరోనా పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదు: హైకోర్టు

కరోనా చికిత్సలకే పూర్తిగా  కేటాయించిన గాంధీ ఆస్పత్రిలో.. కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయకపోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షల కోసం వెళ్లిన వారిని వెనక్కి పంపడమేంటని ప్రశ్నించింది. ఎక్కడికో వెళ్లి పరీక్షలు చేయించుకుని చికిత్స కోసం గాంధీకి రావాలా అంటూ విస్మయం వ్యక్తం చేసింది.  గాంధీ ఆస్పత్రిలో కూడా కొవిడ్​ పరీక్షలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  

కరోనా పరీక్షలు, చికిత్సల తదితర అంశాలకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహన్, జస్టిస్ విజయ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. గాంధీ ఆస్పత్రిలో గర్భిణీలకు మాత్రమే కరోనా పరీక్షలు జరుపుతున్నామని విచారణ సందర్భంగా వైద్య విద్య సంచాలకులు రమేశ్​ రెడ్డి హైకోర్టుకు తెలిపారు.  ఇదేం పద్ధతని హైకోర్టు ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆ విధానమే అమలు చేస్తున్నామని రమేశ్​ రెడ్డి వివరించారు. ఈ వివరణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షలు చేయనప్పుడు గాంధీ ఆస్పత్రిలో రాపిడ్ యాంటీ జెట్ పరీక్షల కిట్లు ఎందుకని ప్రశ్నిచింది. 

నోటీసులిచ్చారా?

కరోనా పరీక్షల కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్ కేంద్రాలకు వెళ్తే.. వివిధ పరీక్షలు చేయాలంటూ దోపిడీ చేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాల్లో కొవిడ్​తో పాటు ఇతర వ్యాధి నిర్ధరణ పరీక్షలకు కూడా గరిష్ఠ చార్జీలు  ఖరారు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కల్పించిన అధికారాలను ఉపయోగించి ప్రైవేట్ ఆస్పత్రులను నియంత్రించాలని పేర్కొంది. కరోనా చికిత్సల కోసం రూ.4 లక్షలకు పైగా వసూలు చేసిన యశోద, కిమ్స్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని.. వాటికి నోటీసు ఇచ్చారా అని న్యాయస్థానం ప్రశ్నించింది.  

ఈనెల 27న నివేదిక సమర్పించాలి

కొవిడ్​కు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆన్​లైన్ విధానం అందుబాటులో ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా చికిత్సలు 84 ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయి.. తదితర  వివరాలు ప్రజలకు తెలిసేలా మీడియా, వెబ్ సైట్ల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలోను కరోనా చికిత్సలు చేయగలరా లేదా తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో ఈనెల 27న నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి:బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

Last Updated : Jul 14, 2020, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details