AP High Court on Big Boss Show : టీవీ ప్రసారాల్లో అశ్లీలతపై అభ్యంతరం ఉన్నవాళ్లు నేరుగా ఏపీ హైకోర్టుకు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. హింస, అశ్లీలత, అసభ్యత ఉందని పిల్ దాఖలైనందున.. ఆ వివరాలను కౌంటర్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మాటివీ ఎండీని హైకోర్టు ఆదేశించింది. బిగ్ బాస్షో కంటే మించిన ఆశ్లీలత ఉన్న కార్యక్రమాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యనించింది. ఇటువంటి వాటిపై అభ్యంతరాలు ఉంటే వీక్షించటం మానేయాలని తెలిపింది.
హింస, అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా, యువతను చెడుమార్గంలోకి నడిపేదిగా.. బిగ్ బాస్ రియాల్టీ షో ఉందని పేర్కొంటూ నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ పీ వెంకట జోతిర్మయితో కూడిన ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. పిటిషనర్ తరపున గుండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు.