Mlas Poaching Case Updates: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు అనుమతిచ్చేలా సింగిల్ జడ్జి తీర్పు ఉందని.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టులో ప్రభుత్వం వాదనలు వినిపించింది. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన కుట్రపై ముఖ్యమంత్రి మీడియా ద్వారా దేశ ప్రజలకు వివరిస్తే తప్పెలా అవుతుందని పేర్కొంది. ప్రజలను వివరించేందుకు రాజకీయ పార్టీ నేతగా చేసిన ప్రయత్నమే తప్ప.. దర్యాప్తును ప్రభావితం చేయడం కాదని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదించారు.
ఒకే విషయాన్ని పరస్పర విరుద్ధంగా ప్రస్తావించారు: ఈ కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన అప్పీలుపై.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాం ధర్మాసనం ఎదుట ఇవాళ సుదీర్ఘ వాదనలు జరిగాయి. సింగిల్ జడ్జి ఒకే విషయాన్ని పరస్పర విరుద్ధంగా ప్రస్తావించారని దుశ్యంత్ దవే న్యాయస్థానానికి తెలిపారు. సీఎం మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని ఆర్థం చేసుకోగలమని అంటూనే స్వయంగా.. ముఖ్యమంత్రి వీడియోలను బహిర్గతం చేశారని ప్రస్తావించారని అన్నారు. బీజేపీ దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేసిందని వాదించారు. సింగిల్ జడ్జి పిటిషన్ పరిధి దాటి తీర్పునిచ్చారని చెప్పారు.