తెలంగాణ

telangana

ETV Bharat / state

HIGH COURT: గడ్డిఅన్నారం మార్కెట్‌ను ఈనెల 18 వరకు కొనసాగించాలి: హైకోర్టు - గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు

గడ్డిఅన్నారం మార్కెట్‌ను ఈనెల 18 వరకు కొనసాగించాలని హైకోర్టు ఆదేశం
గడ్డిఅన్నారం మార్కెట్‌ను ఈనెల 18 వరకు కొనసాగించాలని హైకోర్టు ఆదేశం

By

Published : Oct 4, 2021, 4:24 PM IST

Updated : Oct 4, 2021, 8:09 PM IST

16:21 October 04

గడ్డిఅన్నారం మార్కెట్‌ను ఈనెల 18 వరకు కొనసాగించాలని హైకోర్టు ఆదేశం

గడ్డి అన్నారం మార్కెట్​లో వ్యాపారాలను ఈనెల 18 వరకు కొనసాగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గడ్డిఅన్నారం మార్కెట్​ను బాటసింగారం తాత్కాలిక మార్కెట్​కు  తరలించడాన్ని సవాల్ చేస్తూ హోల్​సేల్ ఫ్రూట్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్​పై జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. బాటసింగారం మార్కెట్​లో సదుపాయాలు, పనులపై రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. బాటసింగారం మార్కెట్​లో పనులు కొనసాగుతున్నాయని.. ఇంకా పూర్తి కాలేదని నివేదించారు.  ఇంకా 21 కోల్డ్ స్టోరేజ్​లు తరలించాల్సి ఉందని.. కొంత ప్రాంతంలో మహీంద్ర కంపెనీ స్థలం ఉందని నివేదికలో పేర్కొంది. కొహెడలో పూర్తిస్థాయి మార్కెట్​లో సగం పనులు పూర్తయినా.. అక్కడికి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని.. కనీస వసతులు లేని తాత్కాలిక మార్కెట్​కు వెళ్లలేమని పిటిషనర్ సంఘం వాదించింది. తాత్కాలిక మార్కెట్ కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయడం కన్నా.. పూర్తిస్థాయి మార్కెట్​ ఏర్పాటు చేయాలని పేర్కొంది. 

గడ్డిఅన్నారంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన అభినందనీయమే కానీ.. మార్కెట్ తరలింపునకు తగిన సమయం ఇవ్వాలని హైకోర్టు అభిప్రాయపడింది. సుమారు మూడు దశాబ్దాలకు పైగా ఉన్న మార్కెట్​ను హడావిడిగా తరలిస్తే ఎలా అని ప్రశ్నించింది. పనులు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని మార్కెట్ కమిటీని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 18వ తేదీన విచారణ చేపడతామన్న ధర్మాసనం.. అప్పటి వరకు గడ్డిఅన్నారంలో మార్కెట్​లో కార్యకలాపాలకు అనుమతించాలని స్పష్టం చేసింది. బాటసింగారం వెళ్లేందుకు ముందుకొచ్చిన వ్యాపారులకు అక్కడికి వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని పేర్కొంది. 

బాటసింగారానికి వెళ్లక తప్పని స్థితి..

జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్యతో పాటు వివిధ కారణాలతో... మార్కెట్‌ను నగర శివారు ప్రాంతానికి తరలించాలని గతంలోనే నిర్ణయించారు. ఇందులో భాగంగానే కోహెడ వద్ద 178 ఎకరాల స్థలం కేటాయించి గత ఏడాదిన్నర కిందట తరలించారు. అప్పుడు వాన, గాలి దుమారానికి షెడ్లన్నీ కుప్పకూలిపోయాయి. దీంతో కోహెడలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి కాకపోవడం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో... బాటసింగారానికి తరలి వెళ్లక తప్పని పరిస్థితి.

తెలుగు రాష్ట్రాల్లోనే పెద్దది..

తెలుగు రాష్ట్రాల్లో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్(gaddi annaram market) పెద్దది. ఉభయ రాష్ట్రాల్లో పండే మామిడి, బత్తాయి, జామ, సపోట, పుచ్చకాయ, దానిమ్మ రకరకాల పండ్లు ఇక్కడ క్రయవిక్రయాలు జరిగేవి. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సంత్రా, ద్రాక్ష, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్ నుంచి ఆపిల్‌ పండ్లకు గడ్డి అన్నారం ప్రసిద్ధి. అదే విధంగా ఇతర దేశాల పండ్లు సైతం లభ్యమయ్యేవి.

తరలింపు సరే కానీ..

గడ్డి అన్నారం నుంచి మార్కెట్‌ తరలింపుపై అభ్యంతరం లేదన్న వ్యాపారులు.. అన్ని సౌకర్యాలు కల్పించి... కోహెడకే పంపాలంటూ ఆందోళన బాటపట్టారు. నిరసన బాటపట్టిన వ్యాపారులకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు అవగాహన కలిగిస్తున్నారు. వర్తక, హమాలీ సంఘాల నేతలతో సంప్రదింపులు చేస్తూ ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోల్ సేల్ ఫ్రూట్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ పిటిషన్‌పై  హైకోర్టు విచారణ చేపట్టింది.  

ఇదీ చదవండి: Telugu academy fd scam: తెలుగు అకాడమీ నిధులను ఎవరు తీసుకున్నారు..?

Last Updated : Oct 4, 2021, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details