Kondapally Municipal Chairman Elections: పలు వివాదల మధ్య జరిగిన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ (Kondapalli Municipal Chairman Elections) ఎన్నిక నేపథ్యంలో మూడో రోజూ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముళ్ల కంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. సుమారు 750 మంది పోలీస్ బలగాలతో పహారా కాశారు. హైకోర్టు ఆదేశాలతో అధికారులు ఎన్నికను నిర్వహించారు. ఎన్నికైన అభ్యర్థులకు రక్షణ కల్పించాలని విజయవాడ సీపీని హైకోర్టు(high court) ఆదేశించింది. కొండపల్లి మున్సిపల్ ఫలితం మాత్రం ప్రకటించవద్దని... వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలవుతుందని పోలీసులు తెలిపారు.
ఆర్వో తీరుపై న్యాయస్థానం ఆగ్రహం
వైకాపా నేతల వీరంగంతో రెండుసార్లు వాయిదా పడిన కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేడు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈనెల 22 న నిర్వహించాల్సిన ఎన్నికను రిటర్నింగ్ అధికారి రెండుసార్లు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ తెదేపా కౌన్సిలర్లు, ఓ స్వతంత్ర అభ్యర్థి, తెదేపా ఎంపీ కేశినేని నాని దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కోరం ఉన్నప్పుడు ఎన్నికను వాయిదా వేయడానికి వీల్లేదని.. వైకాపా కౌన్సిలర్లు అవరోధం కల్పిస్తున్నారనే కారణంతో రిటర్నింగ్ అధికారి ఎన్నికను వాయిదా వేశారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆర్వో శివనారాయణరెడ్డి తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారంనాటి విచారణకు అత్యవసరంగా పిలిపించిన ధర్మాసనం ఆర్వోకు పలు ప్రశ్నలు సంధించింది. అడ్డుకుంటున్నారని ఎన్నిసార్లు ఎన్నికను వాయిదా వేస్తారని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇంకోదానికి అనుమతించబోమని(kondapally municipal elections news) అంటే దానికీ అంగీకరిస్తారా.. అని ఆర్వోపై మండిపడింది.
భద్రత కోసం పోలీసులను అభ్యర్థించారా..?
తెదేపా ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఓటేసేందుకు వీలుకల్పిస్తూ.. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను దాటవేయడం కోసం ఎన్నికను వాయిదా వేస్తున్నారా అని నిలదీసింది. ఎన్నికను అడ్డుకుంటుంటే భద్రత కోసం పోలీసు అధికారులను అభ్యర్థించారా అని ప్రశ్నించింది. కౌన్సిల్ సమావేశానికి అడ్డుపడుతున్నవారిని పోలీసులతో అరెస్ట్ చేయించాలని వ్యాఖ్యానించింది. వైకాపా అభ్యర్థులు ఆటంకం కలిగించడంతో ఎన్నిక నిర్వహించలేకపోయమని ఆర్వో బదులిచ్చారు. ఇప్పటికే అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.