సచివాలయం భవనాల కూల్చివేతలపై కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. భవనాల కూల్చివేతలు చేపట్టడం వల్ల వాటిని ఆపాలంటూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పనులు ఆపాలని గత శుక్రవారం స్టే ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది.
సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు పచ్చ జెండా - సచివాలయం భవనాల కూల్చివేత తాజా వార్తలు
15:18 July 17
సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు పచ్చ జెండా
కేబినెట్ తుది నిర్ణయం తీసుకోక ముందే కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. అయితే గతనెల 30న కేబినెట్ తుది నిర్ణయం తీసుకుందని పేర్కొన్న ప్రభుత్వం.. తీర్మానం ప్రతిని సీల్డు కవర్లో హైకోర్టుకు సమర్పించింది. అయితే ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా కూల్చివేతలు చేపట్టారని చిక్కుడు ప్రభాకర్ వాదించారు. భవనాల కూల్చివేతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని.. నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు.
ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు:
కరోనా విపత్తు వేళ కూల్చివేతల వల్ల పరిసరాల ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందడం లేదని.. ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని ప్రభాకర్ వాదించారు. కూల్చివేతల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. తమకు ఇబ్బంది కలుగుతోందని ప్రజల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఏజీ వాదించారు. అన్ని వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తోందని పేర్కొంది. పిటిషనర్ వాదనలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.