Higu court on Chikoti security: ఈడీ విచారణ ముగిసే వరకు తనకు పోలీసు భద్రత కల్పించాలన్న చీకోటి ప్రవీణ్ వినతిని పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. అతని దరాఖాస్తును వారంలోపు పరిగణనలోకి తీసుకోని నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి సూచించింది. ఈడీ విచారణ ముగిసే వరకు తనకు పోలీసు భద్రత కల్పించాలన్న చీకోటి ప్రవీణ్ పిటిషన్పై ఇవాళ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ విచారణలో పలువురు రాజకీయ నాయకుల పేర్లు బయట పెట్టినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని చీకోటి ప్రవీణ్ తెలిపారు. అందువల్ల తన కుటుంబానికి ముప్పు ఏర్పడిందని పిటిషన్లో చీకోటి ప్రవీణ్ పేర్కొన్నారు.
తన ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్నారని పిటిషన్లో వెల్లడించారు. తనకు, కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరుతూ ఈనెల 4న పోలీసులకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. తనకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు చీకోటి ప్రవీణ్ దరఖాస్తును వారంలో పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణ ముగించింది.
అసలేం జరిగిదంటే:చీకోటి ప్రవీణ్ క్యాసినో దందాపై ఈడీ లోతుగా విచారిస్తోంది. కొందరు ముఖ్య నేతలకు ప్రవీణ్ బినామీగా వ్యవహరించాడని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కొన్నేళ్ల క్రితం ట్రూప్ బజార్‌లో టైల్స్ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్.. అనతి కాలంలోనే రూ.కోట్లు సంపాదించడం వెనుక కారణాలు ఆరా తీస్తున్నారు. గోవా క్యాసినోలో ఏజెంట్‌గా గడించిన అనుభవంతో పంటర్లను ఏకంగా విదేశాలకు తరలించే స్థాయికి ప్రవీణ్ ఎదిగాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ఐదు రాష్ట్రాల ప్రముఖులతో సంబంధాలు కొనసాగించే స్థాయికి చేరుకున్నాడు. క్యాసినోల నిర్వాహణతో రూ.కోట్లు చేతులు మారుతుండటంతో కొందరు రాజకీయ నేతలు డబ్బును విదేశాలకు తరలించి ఉంటారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. హవాలా మార్గంలో ద్రవ్యమారకం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దీని వెనుక ఎవరెవరు ఉన్నారని ఈడీ లోతుగా విచారిస్తోంది. ఆ విషయంపై నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.