AP high court on kondapalli municipal election:ఏపీలోని కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలంటూ తెలుగుదేశం పార్టీ దాఖలుచేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, విజయవాడ సీపీ ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇచ్చారు. రేపు (బుధవారం) ఛైర్మన్ ఎన్నిక జరపాలని మున్సిపల్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఎన్నిక జరిపేలా మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించాలని ఎస్‌ఈసీకి సూచించింది.
ఎన్నిక ఫలితం ప్రకటించవద్దన్న న్యాయస్థానం.. వివరాలు తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఎన్నికైన అభ్యర్థులకు, పిటిషనర్లకు రక్షణ కల్పించాలని విజయవాడ పోలీసు కమిషనర్‌కు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది.
క్షణానికో మలుపు..
kondapalli municipal chairman election: అంతకు ముందు ఎక్స్‌అఫీషియో సభ్యులతో సహా వైకాపా, తెలుగుదేశం కౌన్సిలర్లు ఇవాళ ఉదయం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం వద్ద కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బల్లలు చరస్తూ న్యాయం కావాలంటూ వైకాపా సభ్యులు నినాదాలు చేశారు. కార్యాలయం బయటకు వచ్చి ఆందోళన కొనసాగించారు. ఎంపీ కేశినేని నాని ఓటు చెల్లదని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. కార్యాలయం వద్ద బారికేడ్లను తోసుకుంటూ ముందుకొస్తున్న వైకాపా కార్యకర్తలను పోలీసులు నిలువరించారు. కార్యాలయం బయట వైకాపా శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఎన్నిక ప్రక్రియ అడ్డుకునేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని తెలుగుదేశం ఆరోపించింది.