HC Comments on State: పాఠశాల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన వివరణ ఇచ్చేందుకు హాజరైన సీఎస్ జవహర్‌రెడ్డిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వ లోపాలను తూర్పారపట్టింది. ఈ నిర్మాణాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్ పరిశీలించాక ఆ నిర్మాణాలను కూల్చాలా, లేదా అనే అంశాన్ని తేల్చడంతో పాటు వాటికి చెల్లించిన 40 కోట్లను బాధ్యులైన అధికారుల నుంచి రాబట్టే వ్యవహారంపై ఆదేశాలిస్తామని స్పష్టంచేసింది.
ఉద్యోగులు, గుత్తేదారులు, న్యాయాధికారులు, సిబ్బందికి బకాయిల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. సీఎస్‌కు పలు ఆదేశాలిచ్చారు. సీఎస్ జవహర్‌రెడ్డితోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ గురువారం కోర్టుకు హాజరయ్యారు.
ఒక్కో కేసులో ఒక్కోలా వాదించొద్దు:హైకోర్టు ప్రశ్నలకు బదులిచ్చిన సీఎస్.. పాఠశాలల్లో విద్యా వాతావరణాన్ని కాపాడేందుకు న్యాయస్థానం సరైన ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. పాఠశాల స్థలాల్లో 63 చోట్ల సచివాలయాలు, ఆర్బీకేలు నిర్మించినట్లు చెప్పారు. 57 చోట్ల వాటిని పాఠశాలలకే అప్పగించగా.. తరగతి గదులకు, ఇతర అవసరాలకు వాడుకుంటున్నట్లు తెలిపారు. కోర్టు అనుమతిస్తే.. అసంపూర్ణంగా ఉన్న భవనాలను కూడా పూర్తిచేసి విద్యా అవసరాలకు వినియోగిస్తామన్నారు. మూడు శాఖలతో ముడిపడినందున కోర్టు ఆదేశాల అమల్లో జాప్యమైందని, మరోసారి ఇలా జరగనివ్వబోమంటూ సీఎస్ క్షమాపణలు కోరారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి సీఎస్‌పై పలు ప్రశ్నలు సంధించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులతో సచివాలయాలు, ఆర్బీకేలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఆ నిధుల్లోంచి ఒక్క రూపాయీ మళ్లించేందుకు వీల్లేదన్నారు. పంచాయతీ భవనాలు, సచివాలయాల భవనాలు వేర్వేరు అని, కలిపి చూడొద్దని ఓ వ్యాజ్యం విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వమే గతంలో చెప్పినట్లు గుర్తుచేశారు. నచ్చినట్లుగా ఒక్కో కేసులో ఒక్కోలా వాదించొద్దని గోపాలకృష్ణ ద్వివేదిని ఉద్దేశించి న్యాయమూర్తి అన్నారు. ఉపాధి నిధుల్ని దుర్వినియోగం చేసినందుకు ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరినట్లు పత్రికల్లో చూశామన్నారు.
ఏపీ చరిత్రలో ఎప్పుడైనా చూశారా?: పాఠశాలల ప్రాంగణాల్లో నిర్మాణాలపై నిర్ణయం తీసుకునేముందు అభివృద్ధి కమిటీలు, తల్లిదండ్రుల కమిటీలతో చర్చించారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటుందని వేరే నిర్మాణాలు చేపట్టవద్దంటూ 2020 జూన్‌లో ఉత్తర్వులిస్తే.. ఉల్లంఘించి మరీ కట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటివన్నీ అక్రమ నిర్మాణాలేనని స్పష్టంచేశారు. అప్పట్లో సుమోటో కోర్టు ధిక్కరణ కేసు పెట్టాక తొలగించామని అధికారులు చెబుతున్నా వాస్తవమెంతన్నది సందేహమేనన్నారు. ఇప్పటికీ 239 చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నాయంటున్నారని.. వాటి విషయమేంటో చెప్పాలని ప్రశ్నించారు.
అలాంటి నిర్మాణాలకు చెల్లించిన 40 కోట్ల సంగతేంటని నిలదీశారు. బాధ్యులైన సీఎస్ స్థాయి అధికారి మొదలు కిందిస్థాయి అధికారుల జేబు నుంచి సొమ్ము రాబట్టాలనుకుంటున్నట్లు న్యాయమూర్తి స్పష్టంచేశారు. మీరెక్కడ చదువుకున్నారో తెలియదు కానీ అబ్దుల్ కలాం, వెంకయ్యనాయుడు, నరేంద్ర మోదీ వంటి ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని గుర్తుచేశారు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వానికి ఎందుకంత చులకన అని సీఎస్‌ను ప్రశ్నించారు.