కొవిడ్ ఉన్న సమయంలో రాష్ట్రంలో పాఠశాలలను తెరవాలని నిర్ణయం తీసుకున్న మేధావులెవరు? సచివాలయంలో కూర్చుని ఉత్తర్వులిస్తే సరిపోతుందా? క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకోరా? విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు టీకాలు పూర్తి కాకుండా పాఠశాలలను తెరవడం ఎలా సముచితం? కొవిడ్ నేపథ్యంలో న్యాయస్థానాల్లోనూ భౌతిక విచారణలను నిర్వహించట్లేదు. అలాంటిది పాఠశాలలను ఎలా తెరుస్తారు?
- హైకోర్టు
కరోనా కాలంలో పాఠశాలలను తెరిచి భౌతికంగా తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. న్యాయస్థానం ముందు విచారణకు హాజరైన పాఠశాల విద్యాశాఖ, ఇతరశాఖల అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించి, మండిపడింది. ‘బడిలో సచివాలయం... అవస్థల పాఠం’ శీర్షికతో ఆగస్టు 31న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ అధికారులను నిలదీసింది. ఉన్న రెండు గదుల్లో ఒక దాంట్లో సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్వహిస్తుంటే మరో గదిలో 40 మంది పిల్లలు అవస్థలు పడుతున్నారని గుర్తు చేసింది. గ్రామ సచివాలయానికి వచ్చే ప్రజలతో పిల్లలకు కొవిడ్ సోకితే బాధ్యత ఎవరిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలల్లో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఖాళీ చేయించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యల వివరాలతో అదనపు అఫిడవిట్లు వేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఇతర నిర్మాణాలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని గతేడాది జూన్‌లో జారీ చేసిన ఆదేశాల్ని అధికారులు పెడచెవిన పెట్టడంతో హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి విచారిస్తోంది.
విచారణకు హాజరైన ఏడుగురు ఐఏఎస్‌లు
మంగళవారం జరిగిన విచారణకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనరు గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ వి.చినవీరభద్రుడు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, పురపాలకశాఖ అప్పటి డైరెక్టరు జి.విజయ్ కుమార్, ప్రస్తుత డైరెక్టరు ఎం.ఎం.నాయక్ హైకోర్టు ముందు హాజరయ్యారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి హాజరు కావాల్సి ఉండగా.. వ్యక్తిగత కారణాలతో హాజరు నుంచి మినహాయింపు పొందారు.
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది: న్యాయమూర్తి
అధికారుల తరఫు న్యాయవాదులు కాసా జగన్మోహన్రెడ్డి, విద్యాశాఖ జీపీ రఘువీర్ వాదనలను వినిపించారు. సచివాలయాలు, భరోసా కేంద్రాలను ఖాళీ చేయించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చామని వెల్లడించారు. పలు చోట్ల ఖాళీ చేయించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచామని తెలిపారు. ఆ వివరాల్ని పరిశీలించిన న్యాయమూర్తి.. అలా ఖాళీ చేయిస్తుంటే గురజాడ పాఠశాల ప్రాంగణంలో సచివాలయం, భరోసా కేంద్రం ఎందుకు కొనసాగుతున్నాయని అధికారులను ప్రశ్నించారు. సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాక అధికారులు చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పంచాయతీరాజ్, పురపాలకశాఖ అధికారులతో పోలిస్తే పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1,160 పాఠశాలల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు గుర్తించామని, ఇప్పటికే 450 పాఠశాలల్లో ఖాళీ చేయించామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు నివేదించారు. మిగిలినవీ త్వరలో ఖాళీ చేయిస్తామని తెలిపారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అదనపు అఫిడవిట్లను వేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణకు వారందరినీ హాజరు నుంచి మినహాయించారు.
ఇదీ చదవండి:Schools Reopen: తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్... కొవిడ్ రూల్స్ మస్ట్!