పరువు హత్యలకు సంబంధించి ప్రభుత్వం సమర్పించిన నివేదికలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గత నాలుగేళ్లలో నాలుగు పరువు హత్యలు, మూడు దాడి కేసులు నమోదు కావడంపై అనుమానం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు శక్తివాహిని కేసులో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సర్క్యులర్ జారీ చేశాక, దాని అమలు తీరును పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా కాప్ పంచాయితీలపై 50 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నప్పటికీ ఆ కేసులు ఏ దశలో ఉన్నాయో వివరాలు వెల్లడించకపోవడం సరికాదంది. సర్క్యులర్ అనంతరం నమోదు చేసిన కేసులు అవి ఏ దశలో ఉన్నాయో తాజా నివేదికను సమర్పించాలంటూ డీజీపీని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది.
కులాంతర వివాహాలు చేసుకున్నారన్న కారణంగా యువజంటలను ఆటవికంగా చంపుతున్నారని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలుకాకపోవడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త యు.సాంబశివరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్ కుమార్ వాదనలు వినిపిస్తూ శక్తివాహిని కేసులో సుప్రీం కోర్టు 2018 మార్చిలో మార్గదర్శకాలు జారీ చేసిందని... వాటి ఆధారంగా పరువు హత్యలు కాప్ పంచాయితీలపై కఠినంగా వ్యవహరించాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు అదే ఏడాది మే 2న సర్క్యూలర్ జారీ చేశామని చెప్పారు.