ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కార్యాలయాలు, సర్పంచుల వ్యవస్థ ఉండగా.. దానికి సమాంతరంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం ఎందుకు? సంక్షేమ పథకాల్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నాన్ని పంచాయతీల ద్వారా నిర్వహిస్తే తప్పేముంది? - ఏపీ హైకోర్టు
ఏపీలో ప్రభుత్వ పథకాల్ని పంచాయతీల ద్వారానే ఎందుకు అమలు చేయకూడదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించారు. రాష్ట్రానికి సీఎంలాగే.. గ్రామ పంచాయతీకి సర్పంచి అధిపతి అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు అప్పగిస్తూ ఆ రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25న జారీచేసిన జీవో-2పై విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. గ్రామ పంచాయతీలకు నిధులు పెంచి, మౌలిక సదుపాయాలను ఎందుకు పెంచకూడదని అడిగారు. పంచాయతీలకు సమాంతరంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. వీఆర్వోలకు అధికారాలు అప్పగించడం పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల అధికారాలను లాగేసుకోవడం కాదా? అని వ్యాఖ్యానించారు.
గతంలో ఇచ్చిన జీవోలు 110, 149లకు విరుద్ధంగా జీవో 2 ఉందన్నారు. విద్యార్హతలు ఎక్కువ ఉన్న సిబ్బంది.. వీఆర్వోల కింద పనిచేయాల్సి వస్తోందన్నారు. వ్యవస్థను చక్కదిద్దేలా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని ఏజీకి సూచించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు ముగియడంతో జీవో అమలుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వ్యవహారంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.