ఎమ్మెల్యేలకు ఎర అంశంపై సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా జరుగుతుందనే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టే సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ జస్టిస్ బీ.విజయసేన్ రెడ్డి ఇటీవల ఇచ్చిన 98 పేజీల తీర్పులో కారణాలను వివరించింది. ఎమ్మెల్యేలకు ఎర వివాదం తీవ్రమైనదేనని పేర్కొంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అర్థం చేసుకోదగినదేనని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సీఎం అనడం అసాధారణ విషయమేమీ కాదని అభిప్రాయపడింది. ప్రధాని, హోంమంత్రి పేర్లను సీఎం ప్రస్తావించారన్న కారణంగా సీబీఐకి ఇవ్వాలన్న వాదన సమంజసం కాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే వీడియో సీడీలు బహిర్గతం కావడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సీడీలను ముఖ్యమంత్రి దేశంలోని న్యాయమూర్తులందరికీ పంపించడం తీవ్రంగా పరిగణించదగిన అంశమేనని తీర్పులో ప్రస్తావించింది.
రోహిత్‌రెడ్డి ఇచ్చి ఉండొచ్చు: సీడీలు సీఎంకు ఎలా? ఎప్పుడు? ఎక్కడ చేరాయో మిస్టరీగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వివరణ ఇవ్వలేదని, దర్యాప్తు అధికారే సీఎంకు ఇచ్చారన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చలేదని తీర్పులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఇచ్చి ఉండొచ్చునని అదనపు ఏజీ పేర్కొన్నప్పటికీ, కచ్చితంగా చెప్పలేదని హైకోర్టు పేర్కొంది. కేసుకు సంబంధించిన వీడియోలు, డాక్యుమెంట్లు ఫిర్యాదుదారుడికి ఎలా అందుబాటులో ఉంటాయో కూడా వివరించలేదని తెలిపింది.