Engineering fees hike in telangana ఏఎఫ్ఆర్సీ ఎదుట కాలేజీలు అంగీకరించిన మేరకు ఫీజులను వసూలుకు హైకోర్టు తాజాగా అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రంలో పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెరగనున్నాయి. విద్యార్థులకు ఫీజులు మరింత భారం కానున్నాయి. పద్నాలుగు కళాశాలలకు అనుమతినిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వసూలు చేసిన ఫీజులు పిటిషన్పై తుది తీర్పునకు లోబడి ఉండాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
పాత ఫీజులకు, కొత్త వాటికి మధ్య పెరిగిన సొమ్మును కాలేజీల బ్యాంకు ఖాతాల్లోనే ఉంచాలని.. ఒకవేళ తుది తీర్పు కళాశాలలకు వ్యతిరేకంగా వస్తే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని హైకోర్టు తెలిపింది. రాష్ట్రంలో మూడేళ్లకోసారి ఇంజినీరింగ్ ఫీజులను సవరిస్తారు. మూడేళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది ఫీజుల సమీక్ష కోసం రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. కాలేజీలు ఫీజులు పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించగా.. యాజమాన్యాలను ఏఎఫ్ఆర్సీ పిలిపించి చర్చించాయి.
ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు అంగీకరించిన ఫీజులను ఏఎఫ్ఆర్సీ రిజిస్టర్లో నమోదు చేసింది. అయితే కరోనా పరిస్థితులు, ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని నిర్ణయించిన ఏఎఫ్ఆర్సీ ఈనెల 1న ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ప్రభుత్వం దానిపై తుది నిర్ణయం తీసుకోక పోయినప్పటికీ.. ఈనెల 21న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి.
ఏఎఫ్ఆర్సీ ఎదుట తాము అంగీకరించిన ఫీజుల వసూలు అనుమతించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కోరాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. ఫీజులపై తుది నిర్ణయం ఏఎఫ్ఆర్సీదేనని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం.. మరోవైపు కౌన్సెలింగ్ ప్రారంభమైనందున ప్రవేశాల్లో ఆలస్యం జరగకుండా ఉండేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు వార్షిక ఫీజులు వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో రూ.లక్షా 55 వేలు, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, సీవీఆర్లో రూ.1.50 లక్షలు, గురునానక్ కళాశాలలో రూ.1.20 వేలకు పెరగనున్నాయి. రాష్ట్రంలోని ఇతర కాలేజీలు కూడా హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాయి.
కన్వీనర్ కోటాలో 65,633 ఇంజినీరింగ్ సీట్లు భర్తీ:ఈ విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ కాలేజీల్లో 45 కోర్సుల్లో 65,633 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. జేఎన్టీయూహెచ్, ఓయూ, కేయూ అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయినట్లు తెలిపింది. అత్యధికంగా సీఎస్ఈలో 17,154, ఈసీఈలో 11,375, సీఎస్ఈ ఏఐఎంఎల్లో 7032 సీట్లకు యూనివర్సిటీలకు అనుమతినిచ్చినట్లు పేర్కొంది.
గత విద్యాసంవత్సరంతో పోలిస్తే కాలేజీలు, సీట్లు పెరగక పోయినప్పటికీ.. పలు కాలేజీలు సివిల్, మెకానికల్, ట్రిపుల్ఈ వంటి డిమాండ్ తక్కువ ఉన్న సీట్లను వెనక్కి ఇచ్చి సీఎస్ఈ, ఏఐ ఎంఎల్, ఐటీ వంటి కోర్సులు పెంచుకున్నట్లు తెలిపింది. కన్వీనర్ కోటాలో 70శాతం, యాజమాన్య కోటాలో 30శాతం సీట్లను భర్తీ చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో భాగంగా ఇవాళ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు 8,409 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు.
ఇవీ చదవండి:రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని గవర్నర్కు భాజపా ఫిర్యాదు
ఉచితాలపై భాజపా సహా అన్ని పార్టీలూ ఒకేవైపు, అందుకే మేమే తేలుస్తాం