గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ - గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు
20:16 January 11
గ్రూప్- 1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి హైకోర్టు అనుమతి
Highcourt on Group-1 Prelims: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించేందుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. గ్రూప్-1 ఉద్యోగాలకు తనను స్థానికురాలిగా పరిగణించాలని ఆరో తరగతి మినహా ఒకటి నుంచి పీజీ వరకు తెలంగాణలో చదివిన పి.నిహారిక అనే అభ్యర్థి జులైలో హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏడో తరగతికి ముందు వరసగా నాలుగేళ్లు ఇక్కడ చదివిన వారికే తెలంగాణ స్థానికత వర్తిస్తుందని ప్రభుత్వం వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న సింగిల్ జడ్జి గ్రూప్-1 పరీక్షకు నిహారిక స్థానికురాలిగా పరిగణించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు.
సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ నవంబర్‌లో వేసిన అప్పీలుపై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. సింగిల్ జడ్జి తీర్పు వల్ల ఫలితాలు వెల్లడించలేకపోతున్నామని టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది రాంగోపాల్ రావు హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. స్పందించిన ధర్మాసనం ఫలితాలు వెల్లడించవచ్చునని.. నిహారిక మార్కులు, రిజర్వేషన్, ఇతర వివరాలను తమకు సమర్పిస్తే.. స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని హైకోర్టు పేర్కొంది. స్థానికత వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. 503 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు. టీఎస్పీఎస్సీ అక్టోబరు 29న గ్రూప్-1 ప్రాథమిక కీ ప్రకటించింది.
ఇవీ చదవండి: