విత్తనోత్పత్తిదారుల సమావేశంలో కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్ మాదాపూర్ హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ విత్తన పరీక్షా సంఘం - ఇస్టా సదస్సు అమూల్యమైన చర్చలకు వేదికైంది. ఇస్టా సదస్సులో భాగంగా విత్తనోత్పత్తిదారుల సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ప్రత్యేకించి విత్తనోత్పత్తిదారుల కోసమే ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి 1600 మంది రైతులు హాజరయ్యారు. ప్రధాన ఆహార పంట వరి సహా మొక్కజొన్న, జొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూర వంటి పంటల నాణ్యమైన విత్తనోత్పత్తిలో అవలంభించాల్సిన పద్ధతులపై నిపుణులు రైతులకు చక్కటి అవగాహన కల్పించారు. విత్తనోత్పత్తిలో జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత, మొలక శాతం, విత్తన ఓజస్సు, ఏకరూపత రంగు, తేమ శాతం, మొలక సాధ్యత, ఏకరూపత పరిమాణం, ధీర్ఘాయువు లాంటి లక్షణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.
విత్తనాల ఉత్పత్తికి ప్రపంచంలోనే శ్రేష్ఠమైన ప్రాంతం
విత్తనాల ఉత్పత్తికి ప్రపంచంలోనే తెలంగాణలో శ్రేష్ఠమైన వాతావరణం ఉంటుంది. రాష్ట్రంలో ఉత్పత్తైన విత్తనం ప్రపంచంలో ఎక్కడైన పండటం ఒక ప్రత్యేకత. తెలంగాణలో విత్తనాల పంట పండాలి.. ఆ విత్తనాలు ప్రపంచ దేశాల్లో వ్యవసాయ పంటలకు ఆధారం కావాలన్నది సర్కారు లక్ష్యం. పంట కాలనీల తరహాలో విత్తన పంట కాలనీలను ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదగడం పెద్ద విషయం కాదని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.