కరోనా పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ తరగతుల పేరుతో దోపిడీ చేస్తున్నాయని నటులు శివబాలాజీ, మధుమిత ఆరోపించారు. కేవలం బోధన రుసుం మాత్రమే నెలవారీగా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ.. కొన్ని పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ఓ వైపు ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే.. పాఠశాలల యాజమాన్యాలు అమానవీయంగా దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
స్కూల్ ఫీజులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: శివబాలాజీ, మధుమిత - ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నటులు శివబాలాజీ, మధుమిత ఆవేదన
ప్రైవేటు పాఠశాలలు గత సంవత్సరానికి ఈ ఏడాదికి అదే ఫీజును తీసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని నటుడు శివబాలాజీ అన్నారు. హైదరాబాద్లో దాదాపు అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. అనేక మంది తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉందని నటి మధుమిత తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కారం చూపాలని కోరారు. హైదరాబాద్ స్కూల్ పేరంట్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సోమాజీగూడలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్దాక్షిణ్యంగా ఆన్లైన్ తరగతులు నిలిపివేసి విద్యార్థులను అవమానానికి గురి చేసి ఒత్తిడి పెంచడం దుర్మార్గమని శివబాలాజీ, మధుమిత దుయ్యబట్టారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల బాధితులందరికీ అండగా ఉంటామని.. అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ స్కూల్ పేరంట్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సోమాజీగూడలో ఆయన పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు రాష్ట్రాలకు కేంద్రం స్వేచ్ఛనివ్వడం చాలా తప్పని.. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హైదరాబాద్ స్కూల్ పేరంట్స్ అసోసియేషన్ పేర్కొంది.
ఇదీ చూడండి :'ఆన్లైన్లో చేతబడి నేర్చుకుని అలా చేశారు... చివరకు ఇలా దొరికారు'