తెలంగాణ

telangana

ETV Bharat / state

Historic Monuments: శిథిలావస్థకు భాగ్య నగరంలోని వారసత్వ కట్టడాలు - Historic Monuments

Historic Monuments : భాగ్యనగరంలో ఎన్నో కట్టడాలు మెరుగులు దిద్ది పునర్వైభవమిస్తామన్నా.. పాలకుల మాటలు గాల్లో కలిసిపోతుండగా.. నేలమట్టమయ్యే దశలో బేల చూపులు చూస్తున్నాయీ చారిత్రక సౌధాలు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న కలిగిన కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వందల ఏళ్ల చరిత్ర నేలకూలుతుంటే చూస్తూ ఉండటం తప్ప.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అధికారులు.

Historic Monuments
వారసత్వ కట్టడాలు

By

Published : Dec 17, 2021, 10:07 AM IST

Historic Monuments: నగరం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలంటే.. పర్యాటకంగా సత్తా చాటాలి. వందలాదిగా వారసత్వ కట్టడాలున్న భాగ్యనగరం మాత్రం ఆ విషయంలో వెనుకంజలో నిలుస్తోంది. గోల్కొండ, చార్మినార్‌, మక్కా మసీదు, కుతుబ్‌షాహి టూంబ్స్‌ వంటి కొన్ని కట్టడాలనే అధికారులు పరిరక్షిస్తున్నారు. మిగిలినవి నిర్లక్ష్యంలో కూరుకుపోయాయి. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక.. మొజంజాహి మార్కెట్‌, కొన్ని చిన్నపాటి మెట్ల బావులు మాత్రమే పునరుద్ధరణకు నోచుకున్నాయి. ప్రధానమైన గడియార స్తంభాలు, మార్కెట్లు, సమాధులు, మసీదులు, గుళ్లు, పరిపాలన భవనాలు తదితర వారసత్వ కట్టడాలు నిరాదరణకు గురయ్యాయి. ఇటీవల మొదటిసారి సమావేశమైన గ్రేటర్‌ హెరిటేజ్‌ కమిటీ వారసత్వ కట్టడాలను సంరక్షిస్తామని ప్రకటించిన సందర్భంగా.. నగరంలోని పలు చారిత్రాత్మక కట్టడాల దీనావస్థపై క్షేత్రస్థాయి పరిశీలన కథనం.

కమిటీలు కాలక్షేపానికేనా!

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక వారసత్వ కట్టడాల సంరక్షణకు 2017లో ప్రభుత్వం హెరిటేజ్‌ తెలంగాణ-2017 చట్టాన్ని తెచ్చింది. ఈ ఆగస్టులో రాజధానిలోని కట్టడాల పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఛైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేసింది. మూణ్నెళ్లయ్యాక ఆ కమిటీ తొలిసారి మొక్కుబడిగా సమావేశమైంది. 27 వారసత్వ కట్టడాలను ఎంపిక చేశామని, వాటిలో ఆక్రమణలను తొలగించి, మౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలని నిర్ణయించింది. కార్యాచరణపై ఇంతవరకు స్పష్టత లేకపోవడం చిత్తశుద్ధి లోపానికి నిదర్శనం.

టోలీ మసీదు

కార్వాన్‌లో టోలీ మసీదును 1671లో మూసాఖాన్‌ నిర్మించారు. ఆ రోజుల్లో ముంబయి నుంచి గోల్కొండ రాజ్యానికి కార్వాన్‌ మీదుగా వచ్చే వస్తువులపై సుంకం కింద దమ్మిడి(టోలీ) వసూలు చేసి దీని నిర్మాణానికి వెచ్చించారు. దీన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పాతబస్తీలో..

సంతోష్‌నగర్‌ ఫిసల్‌బండలోని పాయిగా టూంబ్స్‌ అద్భుతమైన ప్రాచీన శిల్పకళా వైభవాన్ని నిలువెత్తు నిదర్శనం. అక్కడికి చేరుకునే దారులు, కట్టడాల పరిసరాలు, చెత్తాచెదారంతో నిండి ఉండటంతో పర్యాటకులు నిరాసక్తత చూపిస్తున్నారు. 400 ఏళ్ల నాటి మాదన్నపేట పాత ఈద్గా సైతం శిథిలావస్థకు చేరుకుంది. నిజాం రాజులు నిర్మించిన కిటికీలు, దర్వాజాల్లో.. డబీర్‌పురా దర్వాజా ఒకటి. ఇటీవల ఇక్కడి ఆక్రమణలను తొలగించినా, అభివృద్ధి చేయడంలేదు.

చాళుక్యుల నాటి నిర్మాణం

చాళుక్యుల కాలం నుంచి నిజాం హయాం వరకు అంగరంగ వైభవంగా పూజలు, ఉత్సవాలు జరుపుకొని.. ప్రసిద్ధిగాంచిన చాంద్రాయణగుట్టలోని స్వయంభువు లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం శిథిలావస్థకు చేరుకుంది. ఆ కాలంలో స్వామి కల్యాణం రోజు జంట నగరాల్లో సెలవు ప్రకటిస్తూ నిజాం రాజు ఫర్మానా జారీ చేసేవారు. ఇప్పుడా కోవెలలో నిర్మాణాలు కూలిపోతున్నాయి. కొండపైకి వెళ్లే మెట్ల మార్గం, ఉపాలయాల పరిసరాలు అధ్వానంగా మారాయి.

బడీ మసీదు

భోలక్‌పూర్‌లో 450 ఏళ్ల కిందట అప్పటి నవాబు ఇబ్రహీం కులీకుతుబ్‌షా జామియా మసీదును(బడీ మసీదు) నిర్మించారు. మక్కా మసీదు తర్వాత.. నగరంలో రెండో అతిపెద్దది. పురాతనమైనది కావడంతో ఏక్‌మినార్‌ నుంచి పెచ్చులూడి పడుతున్నాయి.

శిథిలావస్థలో సర్‌ రొనాల్డ్‌ రాస్‌ భవనం

ప్రపంచాన్ని వణికించిన మలేరియా వ్యాధికి దోమకాటే కారణమని ఆంగ్లో ఇండియన్‌ శాస్త్రవేత్త సర్‌ రోనాల్డ్‌ రాస్‌ కనుగొన్నారు. బేగంపేటలోని ఓ భవనంలో పరిశోధన చేయగా, దానికి సర్‌ రోనాల్డ్‌ రాస్‌ భవనంగా పేరు పెట్టారు. ఈ నిర్మాణం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేసి సర్టిఫికెట్‌ కోర్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్న అధికారుల హామీ నెరవేరట్లేదు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details