కరోనా వైరస్‌కు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నవేళ... 60ఏళ్ల నుంచి 90 ఏళ్లుపైబడినవారు కరోనా కాటుకు బలవుతున్నాయి. నమోదవుతున్న కేసులు, మరణాల్లో వయోవృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో... మిగతా వారిలో తెలియని ఆందోళన వెంటాడుతోంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ హెల్పేజ్ ఇండియా లాక్‌డౌన్ సమయంలో... 21 రాష్ట్రాల్లోని వృద్ధుల జీవితాలపై జాతీయస్థాయిలో సర్వే నిర్వహించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 6 వేల మంది వృద్ధులను నమూనాగా తీసుకొని చేపట్టిన సర్వేలో... 53 శాతం మంది పురుషులు, 47 శాతం మంది మహిళలపై కోవిడ్ ప్రభావాన్ని తెలుసుకున్నారు. ఆ సర్వేలో మునపటి కంటే అత్యంత దయనీయ స్థితిలో పండుటాకులు మగ్గుతున్నారని తేలింది.
సర్వేలో ఏమి తేలిందంటే...
వృద్ధుల జీవన స్థితి, ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పోషణ, సామాజిక స్థితి, అవసరాలపై నిర్వహించిన సర్వే ప్రకారం... ప్రభుత్వం, మీడియా వల్ల కరోనా వైరస్‌పై అవగాహన కలిగిందని 91 శాతం మంది తెలిపారు. 71 శాతం మంది వృద్ధులు లాక్‌డౌన్ కారణంగా తమ కుటుంబసభ్యుల ఉపాధి దెబ్బతిందని వాపోయారు. వారిలో 61 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయి పూట గడవడమే కష్టంగా మారిందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 39 శాతం మంది వృద్ధులది ఇదే బాధ. నిత్యావసర సరకులు, మందుల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు... గ్రామీణ ప్రాంతాల్లో 84 శాతం మంది వృద్ధులు ఆవేదన వ్యక్తం చేయగా.. పట్టణ ప్రాంతంలోనూ 71 శాతం మంది తమ సమస్యలను వ్యక్తపరిచారు.