అధిక లాభాల ఆశచూపి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు, పెట్టుబడులు స్వీకరించి మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆస్తుల జప్తు ప్రక్రియను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రారంభించింది. ఐదు రాష్ట్రాల్లోని సుమారు 300 కోట్ల రూపాయల స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. హీరా గ్రూప్ మోసాలపై తెలంగాణతో పాటు... పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. నౌహీరా షేక్, ఇతర డైరెక్టర్లను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ ఛార్జ్‌షీట్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ... నౌహీరా షేక్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించి.. చంచల్‌గూడలో జైళ్లోనే సుదీర్ఘంగా ప్రశ్నించింది. అధిక వడ్డీ, లాభాల ఆశచూపించి 24 కంపెనీల ద్వారా దేశవ్యాప్తంగా లక్ష 72వేల మంది నుంచి సుమారు 5600 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
రూ.300 కోట్ల విలువైన హీరా గ్రూప్ ఆస్తులు ఈడీ జప్తు - ఆస్తుల జప్తు
హీరాగ్రూప్ ఆస్తులపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపింది. నౌహీరా షేక్, ఇతర డైరెక్టర్ల పేరిట ఉన్న సుమారు 300 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. ఐదు రాష్ట్రాల్లో విలువైన భూములు, భవనాలతో పాటు.. వివిధ బ్యాంకు ఖాతాల్లో సొమ్మును మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసింది. డిపాజిట్లు, పెట్టుబడుల రూపంలో దాదాపు 5600 కోట్ల రూపాయలు సేకరించినట్లు తేల్చిన ఈడీ... మిగతా ఆస్తుల కోసం వేట కొనసాగిస్తోంది.
ఆర్బీఐ, సెబీ, ఇతర చట్టాలను పట్టించుకోకుండా.. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో 182 ఖాతాలు తెరవడమే కాకుండా.. విదేశాల్లోనూ పది బ్యాంకు ఖాతాలు తెరిచి డిపాజిట్లు, పెట్టుబడులు స్వీకరించినట్లు విచారణలో గుర్తించారు. మోసపూరితంగా సంపాదించిన సొమ్ము ప్రస్తుతం ఏ రూపంలో ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ... ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, దిల్లీలో సుమారు 277 కోట్ల 29 లక్షల రూపాయల విలువైన 96 స్థిరాస్తులను గుర్తించింది. అదేవిధంగా వివిధ బ్యాంకుల్లోని 22 కోట్ల 69 లక్షల రూపాయలు ఉన్నట్లు తేలింది. మొత్తం కలిపి 299 కోట్ల 99 లక్షల రూపాయల విలువైన మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం అటాచ్ చేసింది. అడ్జుడికేటింగ్ అథారిటీ ఆమోదించిన తర్వాత ఆస్తులను ఈడీ తన అధీనంలోకి తీసుకోనుంది. మిగతా ఆస్తులను గుర్తించి జప్తు ప్రక్రియ చేపట్టేందుకు ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.