సాయంత్రం ఐదు దాటిందంటే నగరంలో ట్రాఫిక్ క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అర్ధరాత్రి వరకు అలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ తిప్పలు తప్పించేందుకు పలు చోట్ల ప్రభుత్వం పైవంతెనలు నిర్మిస్తున్నా.. అవేవి రద్దీని తగ్గించలేకపోతున్నాయి. ఈ కష్టాలు చాలవన్నట్లు వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగిపొర్లి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గమ్యం చేరే వరకు గంటల కొద్దీ అలా ప్రయాణం సాగించాల్సిందే. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపే పనిలో నిమగ్నమైంది ట్రాఫిక్ యంత్రాంగం. ఇప్పటికే ఇందుకోసం ప్రయోగాత్మకంగా కొన్ని విధానాలు అమలు చేస్తోంది.
వాన పడితే వణుకుతున్న వాహనదారులు.. కారు పూలింగే పరిష్కారమా..!
By
Published : Sep 3, 2021, 8:43 AM IST
ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు నగరంలోని ట్రాఫిక్ వల్ల వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ఒక వేళ వర్షం పడితే రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచి వావానాలు ముందుకు కదలక తమ గమ్యస్థానాలకు ఎప్పుడు చేరుకుంటామనే పరిస్థితి నెలకొంది. నగరంలో చిన్నపాటి వర్షం పడినా రోడ్లపై నీరు చేరి వాహనాలు ముందుకు కదలక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. వర్షానికి మ్యాన్‌హోల్స్‌లో పడి వాహనాలు ఎక్కడ ఇరుక్కుంటాయోనని కార్ల యజమానులు భయపడుతుంటే, ఎక్కడ ప్రాణాలు పోతాయోనని ద్విచక్రవాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రధాన ప్రాంతాల్లో చినుకు పడితే తీవ్ర సమస్యే..
వర్షం కురిస్తే హపీజ్‌పేట్- కొండాపూర్ రోడ్డుపై డ్రైనేజీ పొంగిపొర్లుతుంది. రాయదుర్గం మల్కం చెరువు వద్ద కొత్తగా వేసిన రోడ్డుపై వర్షపు నీరు నిలుస్తోంది. గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం వచ్చే వాహనాలు నిలిచిపోతున్నాయి. మలక్‌పేట చాదర్‌ఘాట్ రైల్వే వంతెన కింద నీరు చేరి వాహనం ముందుకు కదిలేందుకు గంటల సమయం పడుతుంది. దీంతో అంబర్‌పేటకు వెళ్లే దారి కూడా మూసుకుపోతోంది. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో వర్షం పడితే పిల్లర్ 180 వద్ద నీరు నిలిచి వాహనాల రాకపోకలు ఆగుతున్నాయి. కేవలం పెద్ద వాహనాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. చినుకు పడితే ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్లే దారిలో మూసీ నాలా ఉప్పొంగడం వల్ల వాహనాలు నెమ్మదిగా కదిలి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో వర్షపు నీరు రోడ్లపైకి చేరి వాహనాలు ముందుకు కదలడం లేదు. ఖైరతాబాద్ సోమాజిగూడ రాజ్‌భవన్‌రోడ్డులో వర్షం పడితే చెరువులా మారుతుంది. వాహనాలు ముందుకు కదలక ఖైరతాబాద్ సిగ్నల్ వరకు ట్రాఫిక్ నిలిచిపోతోంది. వనస్థలిపురం, కొత్తపేట, హయత్‌నగర్ డిపో ఇలా నగరంలో ప్రధాన ప్రాంతాల్లో వర్షం పడితే వాహనదారులు గమ్యస్థానాలకు ఎప్పుడు చేరతారో తెలియని పరిస్థితి నెలకొంది.
కార్ పూలింగ్ విధానంతో..
పెరుగుతున్న వాహన రద్దీపై అధికారులు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. పలు శాఖల అధికారుల సమన్వయంతో రహదారులు, డ్రైనేజీ పనులు, సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు. వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. నగరవాసులు ప్రజారవాణా వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండడంలేదు. అందుకే దాదాపు ఏడాదిగా మరో ప్రణాళికతో ట్రాఫిక్ పోలీసులు ముందుకు వచ్చారు. అదే కార్ పూలింగ్. ఇప్పటికే ఓలా, ఊబర్ వంటి కొన్ని సంస్థలు ఈ విధానం అమలు చేస్తున్నాయి. ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది కారు వినియోగించుకుంటే ట్రాఫిక్ కొంత వరకు తగ్గుతుంది. కాలుష్యం కూడా ఆదుపులో ఉంటుంది. దీనిపైనే ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. చాలా మంది ఉద్యోగులు సొంత కార్లలోనే ప్రయాణం చేస్తున్నారు. ఒక్కరిద్దరి కంటే ఆ కార్లలో ప్రయాణం చేయడం లేదు. అందుకే సొంత కార్లలో కూడా ఒక్కరిద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణం చేసేలా చూసేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లలో దాదాపు 75 శాతం వరకు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. మహానగరంలో రోడ్లను ఎంతగా విస్తరించినా పెరుగుతున్న వాహనరద్దీకి సరిపోవడం లేదు. దీంతో కారు పూలింగ్ విధానంతో సమస్యకు చెక్ పెట్టవచ్చన్నది ట్రాఫిక్ పోలీసుల ఆలోచనా. ఈ విధానం ఎక్కువగా విదేశాల్లో అమలవుతోంది. ఇప్పటికే ఒకటి రెండు సంస్థలు విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ఆ సంస్థల యజమాన్యాలు ఇందుకు సహకరిస్తున్నారు. హైటెక్‌సిటీలో ఇదే రకంగా కారు పూలింగ్ చేపడితే సగానికి సగం సమస్య తీరినట్లే. హైటెక్‌సిటీ, మదాపూర్, గచ్చిబౌలీ ప్రాంతాల్లో వందలాది సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో లక్షలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ మార్గంలోనే ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల.. పోలీసులు కారు పూలింగ్ విధానాన్ని ఇక్కడే అమలు చేయాలని భావిస్తున్నారు. అక్కడ కూడా అమలు చేయగలిగితే చాలా వరకు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చు.