వర్షం కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. ఎల్బీనగర్ వద్ద జాతీయ రహదారి డివైడర్ పైనుంచి వరదనీరు పొంగిపొర్లటంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పనామా- ఎల్బీనగర్ రహదారి జలమయం కావడం వల్ల వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. మెహదీపట్నం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి రహదారిపై వాహనాలు నెమ్మదించాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, లంగర్‌హౌస్, మెహదీపట్నం మీదుగా వాహనాలను దారి మళ్లించారు.
జల దిగ్బంధంలోనే
గోల్నాక కొత్త వంతెనపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. ముసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిషేధించారు. గోల్నాక వంతెనపై నుంచి వాహనాల దారిమళ్లింపుతో... అక్కడ రద్దీ పెరిగింది. ఉప్పల్‌లో వరంగల్ జాతీయ రహదారిపై వరద ప్రవాహంతో... వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షం ధాటికి ఫలక్‌నుమా ఓవర్ బ్రిడ్జిపై గుంత ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షానికి మూడు రోజుల పాటు ఈ వంతెన జలదిగ్బంధంలోనే ఉంది.