17 Peoples Died Of Heat Stroke in Telangana :రాష్ట్రంలో నిప్పులు కక్కుతున్న సూర్యుడిధాటికి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం చాలా జిల్లాల్లో వడగాలులు బాగా వీస్తున్నాయి. దీని ప్రభావం ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉంటుంది. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న వారు, ఎండకి తిరిగేవారు పరిస్థితి విషమించి ప్రాణాలు వదులుతున్నారు. మే 25వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 17 మంది వడదెబ్బకు గురై మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా మరణాలు సంభవించాయి.
పేదలు.. కూలీలే ఎక్కువ :
- వడదెబ్బకు లోనవుతున్న వారిలో ఆరు బయట పనిచేస్తున్న రైతులు, కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. వాహన డ్రైవర్లు, హమాలీలు కూడా అస్వస్థతకు గురవుతున్నారు.
- రాష్ట్రంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి.
- ఈ నెలలో హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో సుమారు ఐదుగురు కూలీలు వడదెబ్బతో మృతిచెందినట్లు తెలుస్తోంది.
- ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఏ.దినేశ్ (17), జనగామ జిల్లా పాలకుర్తిలో బాలుడు జీ.విక్రం (11), సిరిసిల్ల జిల్లా చందుర్తిలో 17 ఏళ్ల వ్యక్తి వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలారని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
- వడదెబ్బతో చనిపోయినట్లు ప్రభుత్వ యంత్రాంగం గుర్తిస్తే రెవెన్యూ శాఖ వారికి రూ.3 లక్షల వరకు పరిహారం విడుదల చేస్తుంది. సదరు మరణాన్ని ఆ ప్రాంత ప్రభత్వ ఆసుపత్రి వైద్యుడు, ఇన్స్పెక్టర్, తహసీల్దార్లతో కూడిన త్రిసబ్య కమిటీ క్షేత్రస్తాయి పరిశీలన చేసిన నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే శవ పరీక్షలోనూ లక్షణాలు స్పష్టం కావాలి.
Telangana Heat Stroke :జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన గాదెపాక రేణుక తన ఒక్కగానొక్క కుమారుడిని ఎండలు బలితీసుకున్నాయని కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా.. ఈ నెల 4వ తేదీన ఆమె ఏకైక సంతానమైన విక్ర (11) వడదెబ్బ తగిలి మృత్యువాతపడ్డాడు. ఆరోజు బాలుడు బడిబాట కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు స్నేహితులతో ఆరుబయట ఆటలాడి నీరసించాడు. సాయంత్రం పూట వాంతులు కావడంతో కుటుంబీకులు పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం బాలుడిని వరంగల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు తల్లి రేణుక విలపిస్తున్నారు.