Telangana Weather Report: భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎండ వేడిమి నుంచి కొన్ని రోజుల పాటు ఉపశమనం లభించనుందని తెలిపింది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు.. ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సంచాలకులు డా.నాగరత్న వెల్లడించారు. ఆగ్నేయం, తూర్పు వైపుల నుంచి తెలంగాణ వైపునకు గాలులు వీస్తున్నాయని స్పష్టం చేశారు.
Telangana Weather updates : ఈ గాలుల ప్రభావంతో రేపు మధ్యాహ్నం నుంచి ఉత్తర-పశ్చిమ జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని నాగరత్న పేర్కొన్నారు. 16న కామారెడ్డి జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, నిజామాబాద్ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వాన పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక 17న కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వానలు పడతాయని వెల్లడించారు. పలుచోట్ల గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండొచ్చని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నాయుడుపేటలో రికార్డు స్థాయిలో..: ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని నాయుడుపేటలో 39.8 డిగ్రీల సెల్సియస్ ఎండ నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో భద్రాచలం నిలిచింది. ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రతల కంటే సోమవారం రోజున రెండు డిగ్రీలు పెరుగుదల నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.