Water levels in projects: భారీవర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పరివాహకంలో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. శ్రీరాంసాగర్ నుంచి భద్రాచలం వరకు నదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. మహారాష్ట్ర, ఆదిలాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. శ్రీరాంసాగర్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టుకు 99వేల 850 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా.. 41 వేల క్యూసెక్కులను 9 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా.. ప్రస్తుతం 1087 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 75.78 టీఎంసీలుగా ఉంది.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గోదావరిలో 13 లక్షల 6వేల 618 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా.. నీటిమట్టం 50.9 అడుగులకు చేరింది. భద్రాచలంలో స్నానఘట్టాల ప్రాంతం నీట మునిగింది. గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు.. నీటిమట్టం 53 అడుగులకు పెరిగితే.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఎడతెరిపిలేని వర్షాలతో పాల్వంచలోని కిన్నెరసాని జలాశయానికి వరద భారీగా ప్రవహిస్తోంది. 20 వేల క్యూసెక్కుల మేర వరద ప్రవహిస్తుండగా.. 39 వేల క్యూసెక్కుల... 7 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 407 అడుగులుకాగా... ప్రస్తుతం 403.10 అడుగుల మేర నీరు ఉంది. మరోవైపు కిన్నెరసాని పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న వరద అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు 27 గేట్లను రెండు మీటర్ల మేర ఎత్తి.. 3,44,239 క్యూసెక్కుల నీటిని.. దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి బ్యారేజీకి వదిలారు. సరస్వతి బ్యారేజీకి 3లక్షల 55 వేల క్యూసెక్కులు వస్తుండగా.. 50 గేట్లు తెరిచి అంతేస్థాయిలో వదులుతున్నారు. లక్ష్మీబ్యారేజీకి 9లక్షల 96 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 75 గేట్లను ఎత్తి దిగువకు అంతే మొత్తం వదులుతున్నారు.