Godavari River: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో ప్రవాహ ఉద్ధృతి మరింత పెరిగింది. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూడు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్థ్యం గల కడెం ప్రాజెక్టులోకి బుధవారం తెల్లవారుజాము నుంచే అయిదు లక్షల క్యూసెక్కుల వరద వెల్లువలా వచ్చి చేరింది. ఎల్లంపల్లికి కూడా భారీ వరద వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మించాక ఇంత వరద రావడం ఇదే మొదటిసారి. 19 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా డిజైన్ చేయగా, 12 లక్షల క్యూసెక్కులకుపైగా వచ్చింది.
మూడో ప్రమాద హెచ్చరిక:భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. గోదావరిలో నీటిమట్టం ప్రస్తుతం 59.90 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరి నదిలో ప్రస్తుతం 17.92 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.
శ్రీరామసాగర్, కడెం నుంచి విడుదల చేసిన నీటితోపాటు ఎల్లంపల్లి క్యాచ్‌మెంట్ ఏరియాలో కురిసిన భారీ వర్షాలతో ఈ ప్రాజెక్టుకు మరింత వరద వచ్చింది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. బుధవారం పలు చోట్ల భారీ వర్షాలు పడటంతో సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు రికార్డుస్థాయిలో వరద పోటెత్తింది. ఈ బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇదే అత్యధికం. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు క్రమేణా వరద తీవ్రత పెరుగుతూనే ఉంది.
శ్రీరామసాగర్ ప్రాజెక్టు: శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వస్తుండగా.. నాలుగున్నర లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నీటినిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు. గతంలో ఈ ప్రాజెక్టుకు అత్యధికంగా వచ్చిన ప్రవాహం.. 11.08 లక్షల క్యూసెక్కులు. వరద పెరిగితే ఇంకా ఎక్కువ మొత్తాన్ని దిగువకు వదలనున్నారు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు.