తెలంగాణ

telangana

ETV Bharat / state

HEAVY RAIN EFFECT: రాజధానిలో కుండపోత.. అరగంటలో అతలాకుతలం - weather news

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిలా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ వాసులు అల్లాడుతున్నారు. శనివారం మధ్యాహ్నం అరగంట వ్యవధిలో కురిసిన ఏకధాటి వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో మూసారాంబాగ్ వంతెన నీట మునిగింది. అంబర్‌ పేట, దిల్‌సుఖ్‌నగర్‌ మధ్య సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సూచించింది.

http://10.10.50.85//telangana/05-September-2021/tg_hyd_01_05_rain_effect_in_state_pkg_3066407_0509digital_1630781052_247.txt
http://10.10.50.85//telangana/05-September-2021/tg_hyd_01_05_rain_effect_in_state_pkg_3066407_0509digital_1630781052_247.txt

By

Published : Sep 5, 2021, 3:55 AM IST

Updated : Sep 5, 2021, 6:29 AM IST

రాజధానిలో కుండపోత.. అరగంటలో అతలాకుతలం

కుంభవృష్టిలా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ ప్రజలు అల్లాడుతున్నారు. అరగంట నుంచి గంట వ్యవధిలోనే శనివారం మధ్యాహ్నం ఏకధాటిగా పలు ప్రాంతాల్లో వాన పడింది. రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మరో 4 రోజుల పాటు ఇలాగే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న సూచించారు. ఎగువ నుంచి భారీ వరద రావడంతో మూసారాంబాగ్‌ బ్రిడ్జి నీట మునిగింది. అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ మధ్య సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. యాకత్‌పురా లోతట్టు బస్తీ, సైదాబాద్‌లోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద చేరింది. అంబర్‌పేటలోని ఆబ్కారీ కార్యాలయంలో అడుగు లోతు నీరు నిలిచింది.

నెమ్మదించిన ట్రాఫిక్​

దిల్‌సుఖ్‌నగర్‌ కోదండరామనగర్‌ ఎప్పటిలాగే వాననీటిలో చిక్కుకుంది. సరూర్‌నగర్‌ చెరువు నీరు ఆ ప్రాంతంలోని రోడ్లపై మోకాళ్ల లోతులో ప్రవహించింది. సాయిబాబా ఆలయంలోకి నీళ్లు చేరాయి. హైదరాబాద్‌ అంతటా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. మలక్‌పేట, చాదర్‌ఘాట్‌ మార్గంలోని ఆర్‌యూబీ వద్ద భారీగా నీరు నిలిచి ట్రాఫిక్‌ నెమ్మదించింది. నగరంతో పాటు పక్కనే ఉన్న సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా హైదరాబాద్‌లోని కుర్మగూడ(సైదాబాద్‌)లో 10.4, సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో 10.1, కొండపాకలో 9.5, ఆస్మాన్‌గఢ్‌ (హైదరాబాద్‌)లో 9.2, మునిగడపలో 9, మెదక్‌ జిల్లా సర్దనలో 8.9, వెల్దుర్తిలో 8.4, నారాయణరావుపేటలో 8.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి రాత్రివరకూ రాజధానిలో నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. జంట జలాశయాలు హిమాయత్‌సాగర్‌, గండిపేట నిండటంతో నీరు దిగువకు వదులుతున్నారు. దీంతో మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహకంలోని లోతట్టు ప్రాంతవాసులను అధికారులు అప్రమత్తం చేశారు.

చురుగ్గా రుతుపవనాలు

బంగాళాఖాతం తూర్పు, మధ్యప్రాంతంలో 4.3 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో సోమవారంలోగా అక్కడే ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు చెప్పారు. మరోవైపు తెలంగాణ పక్కనే ఛత్తీస్‌గడ్‌పై 2.1 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉంది. భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఆమె వివరించారు. గాలుల కారణంగా కారుమబ్బులేర్పడి అప్పటికప్పుడు కొద్దిగంటల్లోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు.

తగ్గిన కరెంటు డిమాండు.. మునిగిన పైర్లు

అధిక వర్షాలతో వాతావరణం బాగా చల్లబడింది. మహబూబ్‌నగర్‌లో శనివారం పగలు గరిష్ఠ ఉష్ణోగ్రత 27.7 డిగ్రీలే ఉంది. ఇది సాధారణంకన్నా 3.7 డిగ్రీలు తక్కువ. గాలిలో తేమ పెరిగి చలి వాతావరణమేర్పడింది. ఫ్యాన్లు, ఏసీలు, వ్యవసాయ బోర్ల వినియోగం లేనందున కరెంటు డిమాండు గణనీయంగా తగ్గింది. శనివారం గరిష్ఠ డిమాండు 8,149 మెగావాట్లుంది. గతేడాది ఇదేరోజు(సెప్టెంబరు4న) 10,852 మెగావాట్లుండటం గమనార్హం. కొద్దిగంటల్లో అతి భారీ వర్షం ధారగా కురుస్తున్నందున పంటలు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత, కాత దశలో ఉన్న పత్తి, మొక్కజొన్న, సోయా, కంది, పెసర, మినుము తదితర పంటల్లో నీరు ఎక్కువగా నిలిస్తే దెబ్బతింటాయి. పొలాల్లో నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు బయటికి వెళ్లేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ సూచించారు. వర్షాలకు నీరు అధికంగా వస్తున్నా అది వెళ్లిపోతే పంట నష్టం తగ్గుతుందని ఆయన తెలిపారు.

కొట్టుకుపోయిన ఎడ్లబండి.. చిన్నారులను కాపాడిన స్థానికులు

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం శంకరాపూర్‌ గ్రామంలో తన సోదరుని కుమారుడైన రజనీకాంత్‌(12)తో కలిసి కృష్ణ(14)అనే బాలుడు శనివారం ఎడ్లబండితో పాటు ఎడ్ల జతను మేపడానికి తమ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. సాయంత్రం వర్షం పడిన తర్వాత ఎడ్ల జతను బండి వెనుక తాడుతో కట్టి ఇంటికి బయలుదేరారు. దారి మధ్యలో ఉన్న వాగును దాటే క్రమంలో ప్రవాహంలో బండి, ఎడ్లతో సహా అర కి.మీ. వరకు కొట్టుకుపోయారు. కిష్టాపూర్‌ గ్రామ రహదారిపై ఉన్న వంతెన వద్ద గమనించిన స్థానికులు వీరిని రక్షించారు. వంతెన కింది నుంచి బండితో పాటు నాలుగెడ్లు కొంతదూరం వెళ్లి అక్కడ చెట్టు వద్ద నిలిచిపోయాయి. కాగా ఓ ఎద్దు మృతి చెందింది. చిన్నారులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

పిడుగుపాటుతో రైతు మృతి

మెదక్‌ జిల్లా హవేలి ఘనపూర్‌ మండల పరిధి వాడిగ్రామ శివారులోని తన పొలాన్ని చూసేందుకు వెళ్లిన ఇమ్మడి రాజయ్య (45) పిడుగుపాటుతో మృతిచెందారు. ఉరుములు, మెరుపులతో వర్షం రావడంతో తడవకుండా ఉండేందుకు పొలం సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో రాజయ్య అక్కడికక్కడే చనిపోయాడు.

పలు జిల్లాల్లో..

రాష్ట్రంలోని జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, మహబూబ్‌నగర్, వరంగల్‌, హన్మకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి తదితర జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లిలో 146.0, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 116.3, సిద్దిపేట జిల్లా కొండపాకలో 114.5, హైదరాబాద్‌ సైదాబాద్‌లో 95.8 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: Heavy Rain: అలర్ట్​ హైదరాబాద్‌... దంచికొడుతున్న వాన

Last Updated : Sep 5, 2021, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details