తెలంగాణ

telangana

ETV Bharat / state

Rains in Telangana districts : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. అలుగుపారుతున్న చెరువులు - Rains in Telangana districts

Telangana rains : రాష్ట్రంలో వాన జోరు తగ్గినా ప్రభావం మాత్రం కొనసాగుతోంది. పలు జిల్లాల్లోని చెరువులు అలుగుపోస్తున్నాయి. చెరువుల ఉద్ధృతితో అనేక రహదారులపై నీళ్లుచేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఏజెన్సీ, పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ప్రవాహ ఉద్ధృతితో ముంపు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Rains
Rains

By

Published : Jul 21, 2023, 8:08 PM IST

Updated : Jul 21, 2023, 8:50 PM IST

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. అలుగుపారుతున్న చెరువులు

Heavy rains in Telangana districts : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మట్టి మేటలు వేయడంతో పంటలు దెబ్బతిన్నాయి. నారాయణపూర్‌లో చెరువు కట్ట తెగి ఇళ్లలోకి నీరు చేరింది. బావోజ్‌పేట్‌లో రోడ్డు కోతకు గురైంది. ఆసిఫాబాద్‌లో అడ గ్రామం వద్ద పెద్దవాగుపై నిర్మించిన కుమురం భీం ప్రాజెక్ట్ ఆనకట్ట సైడ్ వాలు పగుళ్లు తేలి ప్రమాదకరంగా మారింది.

కోతకు గురైన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు.. మంచిర్యాల జిల్లాలోని గొల్లగట్టు వాగు ఉద్ధృతికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకుపోయింది. చెన్నూర్ మండలంలో అక్కెపల్లి బతుకమ్మ వాగు ఉద్ధృతికి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వర్షాలతో 100 కు పైగా చెరువులు అలుగుపారుతున్నాయి. యానంపేట, హోన్నాజీపేట, జానకంపేటలో ఇళ్లు కూలిపోయాయి. ఇందల్వాయి-ధర్పల్లి ప్రధాన రహదారి లింగాపూర్ వాగు వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం హసన్‌టాక్లి, లింబుర్ గ్రామాల మధ్య ఉన్న వంతెన పై నుంచి నీరు ప్రవహిస్తోంది.

నిలిచిపోయిన రాకపోకలు.. రెంజల్ మండలం కందకుర్తి వద్ద త్రివేణి సంగమం ప్రవాహంతో శివాలయం నీట మునిగింది. సాలుర మండల శివారులోని లోలెవల్ వంతెనపై నుంచి మంజీరా ఉద్ధృతితో తెలంగాణ-మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాలలోని ధరూర్ క్యాంపులోని పోలీస్ డాగ్స్ స్కాడ్ ఆఫీస్ వద్ద భారీ వృక్షం నేల కూలింది. జగిత్యాల- జన్నారం మార్గంలో పెంబట్ల -కోనాపూర్ వద్ద రోడ్డుపై నుంచి వరద ప్రవహించింది.

వరంగల్‌లోని కృష్ణ, సాయి గణేశ్‌కాలనీల్లోకి వరద నీరు చేరి కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండలోని ఆర్​అండ్​బి గెస్ట్​హౌస్ వద్ద రహదారిపై భారీ వృక్షం నేలకూలింది. ఎంఎస్​నగర్‌లోని గుడిసెలు పూర్తిగా నీట మునిగాయి. వర్ధన్నపేటలోని ఆకేరువాగు ప్రవాహంతో వరిపొలాలు, పత్తి చేలలోకి నీరు చేరింది. పరకాల డివిజన్​లోని చెరువులు, కుంటలు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఏజెన్సీ గ్రామాలను వాగులు చుట్టుముట్టాయి.

వాగులో పడి పశువులకాపరి మృతి.. మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాకాల వట్టి, బయ్యారం పెద్ద చెరువులు జలకళను సంతరించుకున్నాయి. బయ్యారం మండలం కాచనపల్లి శివారులో ప్రమాదవశాత్తు వాగులో పడి గొగ్గల పాపారావు పశువుల కాపరి మృతి చెందాడు. జయశంకర్‌ భూపాలపల్లిలో పెద్దవాగు, పోతుల్వాయి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖమ్మం వద్ద మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం వెళ్లిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

వికారాబాద్ జిల్లాలో తాండూర్ మండలం ఐనెల్లి వద్ద వాగు పొంగడంతో తాండూర్ నుంచి కర్ణాటక చించొలి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. యాలాల మండలం శివసాగర్ ప్రాజెక్ట్ అలుగు పారుతోంది. జంటుపల్లి ప్రాజెక్ట్ నిండు కుండల మారింది. పరిగి మండలం సొండేపూర్ చెరువుకు గండి పడింది.

నీటమునిగిన ఆలయం.. మెదక్‌ జిల్లా వనదుర్గా ప్రాజెక్టు ప్రవాహంతో ఏడుపాయల ఆలయం జలదిగ్భందంలో చిక్కుకుంది. హల్దీ, పసుపులేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. హవేలీ ఘనపూర్ మండలం దూప్‌సింగ్ తండా వద్ద వంతెన కూలి రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట- హనుమకొండ ప్రధాన రహదారి లోలెవెల్ వంతెనపై నుంచి మోయతుమ్మెద వాగు ఉద్ధృతి కొనసాగుతోంది. మందపల్లి, అక్కనపల్లి వాగులు పొంగిపొర్లుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని లోతట్టు కాలనీల్లోకి వరదచేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మత్తడివాగు అలుగు పారుతోంది. కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లిలో ఇళ్లు కూలాయి. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని జాడిమల్కాపూర్ జలపాతం పరవళ్ళు తొక్కుతోంది.

మూసీ పరవళ్లు.. యాదాద్రి భువనగిరిజిల్లాలోని ఆలేరు, కొలనుపాక, బయ్యన్న వాగులు కల్వర్టుల పైనుంచి ప్రవాహిస్తున్నాయి. ఆలేరు-సిద్దిపేట మార్గంలో కొలనుపాక పెద్దవాగు లోలెవెల్ కాజ్‌వేపై ప్రవాహంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ పరిధి లోని భీమలింగం కత్వ వద్ద మూసీ పరవళ్లు తొక్కుతోంది. దీంతో చౌటుప్పల్ - భువనగిరి మధ్య రాకపోకలు స్తంభించాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jul 21, 2023, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details