రాష్ట్రంలో కొద్ది గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో కుంభవృష్టిలా కురిసిన వానలతో కాలనీలను, రోడ్లను వరద ముంచెత్తింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. అత్యధికంగా 24 గంటల వ్యవధిలో కుమురం భీం జిల్లా దహేగాంలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా కొలనుపాకలో 19.4, రాజాపేటలో 15.6, జనగామ జిల్లా పాలకుర్తిలో 19, హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో 14, సిద్దిపేట జిల్లా నంగునూరులో 16.2, సముద్రాలలో 15.6, కొండపాక, బెజ్జంకిలో 13, నిర్మల్ జిల్లా భైంసాలో 11.8, నల్గొండ జిల్లా చందూరులో 13, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
రహదారులు జలమయం
సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండలంలో 8 గ్రామాలు నీటమునిగాయి. కోహెడ, తొగుట, చిన్నకోడూరు, చేర్యాల మండలాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. మంత్రి హరీశ్‌రావు చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించారు. మోయతుమ్మెద వాగు ఉప్పొంగడంతో సిద్దిపేట-ఆలేరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట వద్ద లోలెవల్ వంతెనపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆర్టీసీ బస్సు వంతెన అంచు వరకు కొట్టుకుపోయింది. బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో స్థానిక రైతులు వారిని రక్షించారు. వేములవాడలో కుండపోత వర్షంతో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం చుట్టూ ఉన్న రహదారులు జలమయమయ్యాయి.
రాకపోకలకు అంతరాయం
హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రెండు గంటల వ్యవధిలో 10 సెంటిమీటర్లకు పైగా వర్షం కురిసింది. వరంగల్ హంటర్ రోడ్‌లో ఎన్టీఆర్ కాలనీ నీటమునిగింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో చెరువులన్నీ మత్తడి పోస్తున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి నుంచి తొర్రూరు వెళ్లే మార్గంలో లోలెవల్ వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలుచోట్ల చెరువు కట్టలు తెగి వరద నీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలేరు, యాదగిరిగుట్ట మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.