Heavy Rains in Telangana Today : దాదాపు నెల రోజుల విరామం తర్వాత... ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరు వానలు (Heavy Rains in Telangana) కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. రైల్వేస్టేషన్, బస్టాండ్, వీక్లీ మార్కెట్, బోధన్ రోడ్డు సహా పలు రహదారులు వాన నీటితో నిండిపోయాయి. పూలాంగ్ వాగు పరవళ్లు తొక్కుతోంది. మోపాల్ మండలంలో 15, ఇందల్‌వాయి, డిచ్‌పల్లిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Telangana Rain Alert 2023 :భారీ వర్షాల దృష్ట్యా నిజామాబాద్ జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జుక్కల్-బస్వాపూర్ మధ్య ప్రత్యామ్నాయ రోడ్డు.. వర్షానికి కోతకు గురవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదలతో డిచ్‌పల్లి-నిజామాబాద్ మధ్య రాకపోకలు నిలిచాయి. జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి, మోపాల్, నిజామాబాద్ గ్రామీణం, దర్పల్లి, ఇందల్‌వాయి మండలాల్లోని చెరువులు.. అలుగు పోస్తున్నాయి.
Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో రెండు రోజులు ఇలానే
సిరికొండలోని కప్పలవాగు ఉద్ధృతికి గడ్కోల్ వద్ద.. లో లెవెల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఇందల్‌వాయి మండలంలోని వాడి వద్ద.. వాగు ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని గాంధారి వాగు పోటెత్తడంతో.. పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. మాతు సంఘం వద్ద పశువుల కోసం వెళ్లి వాగులో చిక్కుకున్న రైతు సంగయ్యను.. ప్రత్యేక బోటులో వెళ్లి కాపాడారు.
భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్ల మధ్య భారీగా వరద నీరు చేరడంతో.. స్థానికుల రాకపోకలకు కష్టంగా మారింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కోరుట్ల ప్రాంతాల్లో.. పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గొట్టిముక్కుల, గోధుమగూడ వాగులు... ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
Heavy Rains in Hyderabad Today:ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్, హస్తినాపురం, సికింద్రాబాద్, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై నీరు చేరడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రిలో జోరు వాన కురుస్తోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది.