Rains In Telangana Toady : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలుకురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు అవస్థలు పడ్డారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. ఈ క్రమంలోనే రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. పలుచోట్ల తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి. లో లెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో.. పలు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. ప్రాజెక్టుల్లోకి ప్రవాహం పెరుగుతోంది. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నవీపేట్ మండలంలోని జన్నేపల్లి పెద్ద చెరువు అలుగు పారుతుంది. నిజామాబాద్ నగర శివారులోని గూపన్‌పల్లి ఉన్నత పాఠశాల.. వరద నీటితో చెరువును తలపిస్తోంది. పాఠశాల మొత్తం నీటితో నిండిపోయి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నీటిలో నుంచే రాకపోకలు సాగించాల్సి రావడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
Heavy Rain Alert To Telangana :మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జోరు వాన కురుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. సత్తుపల్లిలో ఎడతెరిపి లేని వర్షాలకు బేతుపల్లి చెరువుకు వరద ప్రవాహంపెరిగింది. భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు, కోయగూడెంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది.