తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Rains Updates : వదలని వరుణుడు.. ముఖం చాటేసిన సూరీడు.. ఇళ్లకే పరిమితమైన ప్రజలు

Heavy rains in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పల్లెలు, పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. చెరువులు, వాగుల్లోకి నీరు చేరి అలుగు పారుతున్నాయి. వరద ఉద్ధృతికి కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి ముసురు పడుతుండటంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.

Rains
Rains

By

Published : Jul 21, 2023, 12:56 PM IST

Today Rains In telangana latest news : హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. హుస్సేన్‌సాగర్ నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దుండిగల్ మున్సిపాలిటీలోని బహదూర్‌పల్లిలో ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు నదులుగా మారాయి. రామంతాపూర్, ఉప్పల్, చిలుకానగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, ఘట్ కేసర్, మేడిపల్లి, తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి ఉప్పల్ కూడలి వద్ద భారీగా వర్షం నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

లోతట్టు ప్రాంతాలలో ఇళ్లులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి కలెక్డరేట్ కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సమస్యలు ఎదురైతే 94924 09781 సంప్రదించాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌ కూకట్​పల్లిలో ఐడీఎల్​ చెరువుకు వరద నీరు చేరడంతో పుంతలు తొక్కుతుంది. రసాయనాలు కలుషితాల వల్ల నీటిపై నురగ చేరి తెల్లని పాలపుంతను తలపిస్తోంది. భారీగా గాలి వీస్తుండడంతో జాతీయ రహదారిపైకి నురగ విస్తరిస్తుంది.

కర్ణాటక నుంచి నిలిచిపోయిన రాకపోకలు: వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ బేగంపేట్ ప్యాట్నీ ప్యారడైజ్, మారేడ్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి , చిలకలగూడ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు కూడా దెబ్బతిన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం ఐనెల్లి వాగు పొంగుతుండడంతో కర్ణాటక రాష్ట్రం చించొల- తాండూర్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరం తడిసి ముద్దైంది. హనుమకొండలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద భారీ వృక్షం నేలకూలడంతో వరంగల్ మహానగర పాలక సంస్థ డిజాస్టర్ టీం రంగంలోకి దిగి రాకపోకలను పునరుద్ధరించారు. హనుమకొండ జిల్లా పరకాలలో చెరువులు, కుంటలు, వాగుల్లోకి ఉద్ధృతంగా వరద నీరు చేరుతుంది. పరకాల చలివాగు అలుగు పోస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్, పలిమెల, మహా ముత్తారం, కాటరం, మలహర్ మండలాల్లో భారీ వర్షం పడుతుంది.

నిలిచిపోయిన ప్రజారవాణా: భూపాలపల్లి, మలహర్ మండలం తాడిచర్ల ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కాటారం నుంచి మేడారంకు వెళ్లే రహదారి మధ్యలో కేశవాపూర్- పెగడపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహాముత్తారం - యమన్‌పల్లి మధ్య గల రోడ్డు తెగిపోయే అవకాశం ఉంది. దొబ్బలపాడు, యామన్ పల్లి, దౌత్పల్లి, నిమ్మగూడెం, కేశవపూర్, యత్నారం గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

Telangana Rain Alert Today : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అటవీ గ్రామాలను వాగులు చుట్టుముట్టాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు చత్తీస్‌గఢ్‌లో పడుతున్న వానలతో మారుమూలగా ఉన్న కొండ వాగులు విరుచుకుపడుతున్నాయి. కలిపాక వాగు, పెదవాగు, పూస వాగు, పెంక వాగుల ప్రవాహంతో మండలంలోని భోదాపురం పంచాయతీ పరిధికి చెందిన సీతారాంపురం, ముత్తారం, తిప్పాపురం పంచాయతీకి చెందిన కొత్త గుంపు, తిప్పాపురం, కలిపాక, పెంక వాగు, గిరిజన గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ కుండపోతగా వర్షం కురుస్తుంది.

సింగరేణికి భారీ నష్టం: వరుణ ప్రతాపానికి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జనజీవనం ఇళ్ళకే పరిమితమయ్యారు . ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ధరూర్ క్యాంపులోని పోలీస్ డాగ్‌స్కాడ్ ఆఫీస్ వద్ద భారీ వృక్షం నేల కూలింది. సమయానికి అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరద నీరు గనుల్లోకి చేరడంతో బొగ్గు వెలికి తీసే యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

Rains in Telangana 2023 : మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, ఇందారం, కళ్యాణిఖని, రామకృష్ణాపూర్, ఖైరిగుడా ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. రెండు లక్షల 90 వేల టన్నుల మట్టి వెలికితీత పనులను సింగరేణి అధికారులు నిలిపివేశారు. ఒక లక్ష 60 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు 63వ జాతీయ దారి మార్గంలో అక్కెపల్లి బతుకమ్మ వాగు వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల జలదిగ్బంధంలో చిక్కుకుంది. గుడిలోకి భారీగా వరద నీరు చేరింది.

నీట మునిగిన శివాలయం: ఆలయాన్ని మూసివేసి భక్తుల సౌకర్యార్థం రాజగోపురంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో ఏడుపాయల ఆలయ సమీపంలోని వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఆలయం వైపు ఎవరు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద మంజీరా, హరిద్ర, గోదావరి నదులు కలిసే చోటైన త్రివేణి సంగమం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద దాటికి శివాలయం నీట మునిగింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details