Heavy Rains in Nellore: ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు-మనుబోలు మధ్య పంభలేరు వరద ప్రవాహంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కండలేరు డ్యామ్ నుంచి వరద నీరు రావడంతో సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు చెరువు నిండుకుండలా మారింది. చెర్లోపల్లి గ్రామంలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కాలువలు బలహీనపడి పలు ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ నీట మునిగిన తన ఇంటిని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. చెరువు తూము చెక్కలను పైకి లేపకపోవడంతో నష్టం జరిగిందని వాపోయారు.
నాయుడుపేట పరిసరాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు పంటల పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఊళ్లకు ఆనుకుని భారీగా నీరు చేరటంతో నివాసాల పరిస్థితి దయనీయంగా మారింది. పశువులు ఆహారం కోసం అలమటిస్తున్నాయి. బయట మేసేందుకు ఎక్కడ చూసినా నీరు నిలిచి ఉండటంతో మృతి చెందే పరిస్థితి ఏర్పడింది. వెంకటగిరి నియోజకవర్గంలో కుండపోత వర్షం కురుస్తోంది. బాలాయపల్లి మండలంలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కైవల్య నది కాజ్ వే పై వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కడగుంట- నిండలి మార్గంలో మూడో రోజు రాకపోకలు నిలిచిపోయాయి.