ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేకచోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిర్చి, పొగాకు, మినప పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి తమకు కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం నుంచి 10 గేట్లు ఎత్తి పెన్నానదికి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. అనంతసాగరంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పశువుల వైద్యశాలలో వర్షపు నీరు చేరింది. వర్షపు నీటికి స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లెేక పోవడంతో ప్రమాదం తప్పింది.