బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భాగ్యనగరం తడిసిముద్దవుతోంది. ఇవాళ ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు(hyderabad rains) కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం చిరుజల్లులతో మొదలై... మధ్యాహ్నం నుంచి ఓ మోస్తరుగా కురుస్తోంది.
వానలే వానలు
నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, అల్వాల్, తిరుమలగిరి, ప్యారడైజ్‌లో జోరు వాన కురిసింది. పటాన్‌చెరు, మియాపుర్, చందానగర్, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, నాంపల్లి సహా నగరంలో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది.
జలమయం
వికారాబాద్ జిల్లా తాండూరులో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ఎడతెరపిలేని వర్షంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు కాలనీల్లో వరద నీరు ప్రవహించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని.. రాష్ట్రంలో(rains in telangana) మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.