Heavy Rains in Hyderabad Today: రాష్ట్ర రాజధానిలో మరోసారి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులు చెరువుల్ని తలపించాయి. ఏకదాటిగా రెండుగంటలపాటు పడిన వానకి వాహనాలు గంటలతరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సోమాజీగూడ, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో రహదారులపై మోకాలి లోతు నీరు చేరింది.
విద్యుత్ షాక్‌తో కానిస్టేబుల్ మృతి:సికింద్రాబాద్ కళాసీగూడలో 11 సంవత్సరాల బాలిక మౌనిక నాలాలో పడి దుర్మరణం చెందిన ఘటన మరువకముందే... తాజాగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద విద్యుదాఘాతంతో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందాడు. వీరస్వామి యూసుఫ్‌గూడలోని పోలీస్ బెటాలియన్‌లో పనిచేసే.. తన తమ్ముడిని కలిసి తిరిగి ఇంటికి జూబ్లీహిల్స్ నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పింది. వాహనంతో సహా విద్యుత్ స్తంభం సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడగా విద్యుత్ షాక్ తగిలింది. సమాచారం అందకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని.. సీపీఆర్ చేశారు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.