సెప్టెంబరుతో ముగిసిన 4 నెలల(జూన్-సెప్టెంబరు) వర్షాకాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఈసారి రికార్డు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు జిల్లాల పరిధిలో పదేళ్లలో కురవనంత అధికంగా వర్షాలు పడ్డాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనాలు, ఉపరితల ద్రోణులు ఇందుకు దోహదపడ్డాయిని చెప్పింది. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి.
ప్రధాన రహదారులు కాల్వలుగా మారడం, చెరువులు నిండి.. పొర్లడం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆయా రోజుల్లో ఇక్కట్లూ తప్పలేదు. వాతావరణ శాఖ ముందస్తుగా అప్రమత్తం చేయడంతో జీహెచ్‌ఎంసీ, విపత్తుల శాఖ స్పందించి కొంతమేర నష్ట నివారణ చర్యలు చేపట్టగలిగాయి. వానలు ఏ తీరున కురిశాయనేది తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సొసైటీ(టీఎస్‌డీపీఎస్) జిల్లాల వారీగా నమోదు చేసింది. మూడు జిల్లాల్లోని 58 మండలాల పరిధిలో ఎక్కువ రోజులు మోస్తరు వర్షాలు కురిసినట్లుగా పేర్కొంది. ఎక్కువ రోజులు మోస్తరు వర్షాలు కురవడం వల్ల అత్యధిక వర్షపాతం పడినట్లయింది.