బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాను వానలు ముంచెత్తాయి. పెద్దవడుగూరు మండలం మిడుతూరులో ఎడతెరిపి లేని వానలకు వేరుశనగ, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గార్లదిన్నె మండలం కనుంపల్లిలోనూ వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. వర్ష ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ... దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉరవకొండలోని ఐసీడీఎస్ కార్యాలయంలోకి భారీగా వర్షం నీరు చేరింది. సిబ్బంది నీటిని బయటకు ఎత్తిపోశారు. భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి.
విశాఖ జిల్లా కోనాం జలాశయంలోకి ఎగువనుంచి వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన అధికారులు.. నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయంలో నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో.. 2 వేల 250 క్యూసెక్కుల నీటిని బొడ్డేరు నదిలోకి విడుదల చేశారు. దండిసురవరం సమీపంలో బొడ్డేరు నదిలో ఓ బాలుడు గల్లంతవ్వగా... ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అల్పపీడన ప్రభావంతో విశాఖ జిల్లాలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు, తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్‌చంద్ సూచించారు.